ఉత్తమ వైద్యుడు

శంబర అడవిలో ఓ చెట్టుపై కపిక అనే కోతి తన పిల్లతో కలిసి ఉంటోంది. అక్కడి చెట్లకు కాసేపండ్లు తింటూ అవి హాయిగా ఉన్నాయి.కోతి పిల్లకు వయసు వచ్చే కొద్దీ తల్లిని వదిలి అడవిలో ఎక్కడెక్కడికో వెళ్ళి రకరకాల పండ్లు, ఆకులు తిని వస్తోంది. అందువల్ల అది ఒకరోజు వాంతి చేసుకుంది.

“ఏది పడితే అది తినకు నీకు కడుపు నొప్పి వస్తుంది”అని కపిక హెచ్చరించింది. అయినా తల్లి మాటలు పిల్ల కోతికి నచ్చేవి కావు. మరికొన్ని నెలల తరువాత పిల్లకోతి మెల్లగా ఆడవి పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళింది. అక్కడి ప్రజలు పారేసిన ఆహార పదార్థాలు, పండ్లు తినసాగింది. ఈ సారి దానికి తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. వాంతులు అయ్యాయి. దాంతో పిల్లకోతి భయపడి పరుగున అడవిలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్లింది. 

“అమ్మా నన్ను వైద్యుడి వద్దకు తీసుకువెళ్లవే. కడుపు నొప్పిగా ఉంది. వాంతి కూడా అయ్యింది’’ అంటూ ఏడుస్తూ చెప్పింది. “నీకు తిండి గురించి ఎన్ని మార్లు చెప్పినా బుద్ధి రావటం లేదు. నీ అనారోగ్యానికి నువ్వే కారణం. పెద్దలు చెప్పే మాటలు పెడచెవిన పెడితే ఇలాగే జరుగుతుంది. పద మన అడవిలోని ఎలుగుబంటి వైద్యుడి దగ్గరకు వెళ్దాం. ఆయన మంచి పసరు మందు ఇస్తాడు” అని చెప్పి  పిల్లను తీసుకెళ్లింది. 

ఎలుగుబంటి వైద్యుడు పిల్లకోతికి రకరకాల పరీక్షలు చేసి ‘‘మరేం లేదు. నీ బిడ్డ తినకూడనవన్నీ తింటోంది. అందుకే దీని కడుపు చెడింది. ఏవంటే అవి తినడం మానకపోతే కడుపు నొప్పి, వాంతులే కాదు విరోచనాలు రావొచ్చు” అని చెప్పి పసరుమందు ఇచ్చింది. పిల్ల కోతిని కూడా ఇలా హెచ్చరించింది. “చూడమ్మా ఈ వయస్సులో ఏవేవో తినాలని ఉంటుంది. అలా తింటుంటే జబ్బుపడి చెట్టు కొమ్మ మీద ఉండి పోవాల్సి వస్తుంది. నీ స్నేహితులతో ఆడుకోలేవు. నువ్వు పెద్దదానివి అవుతున్నావు. ఆరోగ్యానికి ఏ తిండి మంచిదో, కాదో తెలుసుకోవాలి. నీకు తెలియకపోతే మీ అమ్మను అడగాలి. ఒకవేళ నీకు ఏదైనా ఆహారం దొరికితే అమ్మకు చూపించి తినాలి. తినకూడనిది ఏదైనా తిని కడుపు నొప్పి వస్తే చేదు పసరు మందు ఇస్తాను’’ అన్నాడు ఎలుగుబంటి వైద్యుడు.

ఎలుగుబంటి మాటలు విన్న పిల్లకోతి భయపడి, ‘‘ఇక మీదట ఏది పడితే అది తినను’’ అని దీనంగా చెప్పింది. పిల్లకోతిని తీసుకుని చెట్టు మీదకు వెళ్ళిన తల్లికోతి ఈ విధంగా చెప్పింది. “చూడు మన చెడు అలవాట్లే మన జబ్బులకు కారణం. వయసు వచ్చే కొద్దీ ఏది మంచో.. ఏది చెడో తెలుసుకుని చెడు అలవాట్లను వదులుకోవాలి. ఇంకో ముఖ్యవిషయం జబ్బులు వచ్చాక వైద్యుడి దగ్గరకు వెళ్తే.. వైద్యుడు ఎక్కువ డబ్బులు అడగొచ్చు. మన ఎలుగుబంటి వైద్యుడు మంచివాడు, పరిచయం ఉన్నవాడు కాబట్టి మనల్ని ఏమీ అడగలేదు. అర్థమయ్యిందా?

ప్రపంచంలో ఎవరికి వారే ఉత్తమ వైద్యులు. మనుషుల్ని చూడు వారి చెడు అలవాట్ల వల్ల రోగాల బారిన పడుతున్నారు. అందుకే హాస్పిటల్స్​ రోగులతో నిండిపోతున్నాయి” అని పిల్లకోతి వీపు నిమురుతూ చెప్పింది తల్లి కపిక.“అమ్మా.. నీ మాటలు తప్పకుండా పాటిస్తాను. నాలో వచ్చే మార్పులు నువ్వే చూస్తావుగా’’ అని చెప్పింది. దాని మాటలకు సంతోషించిన కపిక పిల్లకోతికి ఓ ముద్దు పెట్టింది.


- కంచనపల్లి వేంకట కృష్ణారావు-