- రిజిస్ట్రేషన్ సేవలకు లాగిన్ ఐడీ కేటాయింపు
- కొత్తగా ఏర్పాటుచేసిన ఏడు మండలాల ఇవ్వని ప్రభుత్వం
- ఇంకా పాత మండలాల నుంచే డౌన్లోడ్, అప్లోడ్
- ఉన్నతాధికారులు చొరవ చూపితే సమస్యకు పరిష్కారం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2019లో కొత్తగా ఏడు మండలాలను నాటి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కామారెడ్డి జిల్లాలో డొంగ్లి, పాల్వంచ, మహమ్మద్‌నగర్, నిజామాబాద్ జిల్లాలో పొతంగల్, సాలుర, అలూర్, డొంకేశ్వర్ఉన్నాయి. కాగా రిజిస్ట్రేషన్‌కోసం ప్రభుత్వం లాగిన్ ఇచ్చి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు ఇవ్వలేదు. దీంతో పాల్వంచ మండలానికి సంబంధించి సిబ్బంది కల్యాణలక్ష్మి లాగిన్ కోసం పాత మండలం మాచారెడ్డికి, డొంగ్లి సిబ్బంది మద్నూర్‌కు, మహమ్మద్‌నగర్ సిబ్బంది నిజాంసాగర్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో లబ్ధిదారుల ఎంపికలో మందకొడిగా సాగుతోంది. సేవల్లో జాప్యం నెలకొనకుండా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కామారెడ్డి, వెలుగు: కొత్తగా ఏర్పడిన మండలాల్లో కల్యాణలక్ష్మికి లాగిన్ సమస్య ఏర్పడింది. ఈ మండలాలకు సంబంధించి రెవెన్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భూముల రిజిస్ర్టేషన్ కోసం తహసీల్దార్లకు ప్రభుత్వం లాగిన్‌ఐడీ ఇచ్చి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు ఇవ్వలేదు. కొత్త మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల స్కీం కోసం దరఖాస్తు చేయడానికి వస్తే డౌన్లోడ్, ఆప్‌లోడ్ కు పాత మండలానికి ఇక్కడి సిబ్బంది వెళ్లాల్సివస్తోంది. వెరిఫికేషన్ తర్వాత పోర్టల్‌లో అప్లోడ్ కు కొంత జాప్యం జరుగుతోంది.
పరిపాలన సౌలభ్యం పేరిట గత ప్రభుత్వం 2019లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాత కొత్తగా 32 మండలాలను ఏర్పాటు చేసింది. 2022, 2023లో 7 మండలాలు ఏర్పడ్డాయి. ఈ మండలాలను మండల పరిషత్తులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖకు సిబ్బందిని కేటాయించినా, మౌలిక వసతులు కల్పించలేదు. రెవెన్యూ లావాదేవీలు కొత్త మండలాల ఆఫీసర్ల ద్వారానే జరుగుతున్నాయి.
మళ్లీ పాత మండలాలకు..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అప్లికేషన్లు క్లియర్చేయటానికి కొత్త మండలాల ఆఫీసర్లకు లాగిన్ ఇవ్వకపోవడంతో మళ్లీ పాత మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. కాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీంలో ప్రభుత్వం రూ.1,00,116 అందిస్తోంది. వరుడు, వధువు కుటుంబాల వివరాలు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మీసేవ ద్వారా అప్లయ్చేసుకోవాలి. అప్లికేషన్ సంబంధిత తహసీల్దార్ఆఫీసుకు వెళ్తుంది. లబ్ధిదారుడు అప్లయ్చేసిన ఫామ్స్ తహసీల్దార్ఆఫీసులో అందజేయాలి.
ALSO READ : రూ.10 కోట్ల విలువైన వడ్లను దారి మళ్లించిన మిల్లర్.. యాదాద్రి జిల్లాలో ఘటన
అప్లికేషన్లో తెలిపిన వివరాలన్నీ వాస్తవమేనా?, స్కీమ్‌కు అర్హుడా? కాదా? అనే పక్రియను రెవెన్యూ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ డౌన్‌లోడ్‌చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాత తహసీల్దార్ఆఫీస్ నుంచి ఫామ్స్అన్ని మళ్లీ అప్లోడ్ చేసి ఆర్డీవో లాగిన్‌కు పంపాలి.
ఇక్కడ పరిశీలన తర్వాత సంబంధిత నియోజక వర్గ ఎమ్మెల్యే ఆమోదం తర్వాత లబ్ధిదారులకు అమౌంట్మంజూరు చేస్తారు. ఇక్కడే లాగిన్ ఉంటే పరిశీలన తర్వాత వెంటనే ఆన్లైన్లో డాటా అప్లోడ్ చేయొచ్చు. దరఖాస్తులు ఎక్కువగా వస్తేనే వెళ్తున్నారు. స్థానిక కార్యాలయంలో ఇతర పనులు ఉంటే పాత మండలానికి వెళ్లడంతో జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీం లబ్ధిదారుల ఎంపిక కొత్త మండలాల్లో మందకొడిగా సాగుతోంది.