కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగింపు

  • వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు
  • ఇప్పటిదాకా నాలుగు సార్లు కమిషన్ గడువును పెంచిన ప్రభుత్వం
  • 9 నెలల్లో వంద మందికిపైగా అధికారులను విచారించిన కమిషన్​
  • జనవరిలో కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల విచారణ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువును సర్కారు మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండడం, మరికొంత మందిని ఓపెన్ కోర్టులో విచారించాల్సి ఉండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువును పెంచుతూ ఇరిగేషన్‌‌‌‌ శాఖ కార్యదర్శి రాహుల్‌‌‌‌ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సర్కార్‌‌‌‌‌‌‌‌ మూడుసార్లు కమిషన్‌‌‌‌ గడువును పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది మార్చి 14న జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. తుది రిపోర్టును జూన్ 30 నాటికి సమర్పించేలా గడువు ఇచ్చారు. కానీ విచారణ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 28 వరకు పొడిగిస్తూ జూన్ 29న ఉత్తర్వులిచ్చారు. తర్వాత మరోసారి అక్టోబర్​ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టులో, డిసెంబర్ వరకు మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం మళ్లీ గడువు పెంపునకు ఓకే చెప్పడంతో నాలుగు సార్లు పెంచినట్టయింది. ఫిబ్రవరి 28 నాటికి కమిషన్​రిపోర్ట్‌‌‌‌ను సమర్పించాలని కమిషన్‌‌‌‌కు ప్రభుత్వం సూచించింది.

వంద మందికిపైగా విచారణ..

కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 9 నెలల కాలంలో ఐఏఎస్‌‌‌‌లు, రిటైర్డ్​ ఐఏఎస్‌‌‌‌లు, రిటైర్డ్ ఈఎన్‌‌‌‌సీలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీరింగ్​ అధికారులు సహా వంద మందికిపైగా అధికారులను కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారించింది. గత మంగళవారం ప్రారంభమైన ఈ దఫా ఓపెన్ కోర్టులో మాజీ సీఎస్‌‌‌‌లు సోమేశ్ కుమార్, ఎస్కే జోషి, రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్‌‌‌‌తో పాటు కేంద్ర జల శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, కోదండరాంలను కమిషన్ విచారించింది. ఇప్పటిదాకా జరిగిన విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సాంకేతిక, ఆర్థికాంశాలపై కీలక సమాచారాన్ని కమిషన్ సేకరించినట్టు తెలిసింది. కాగా, క్రాస్ ఎగ్జామినేషన్‌‌‌‌లో భాగంగా మరో 15 నుంచి 20 మందిని విచారించాల్సిన అవసరం ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావును క్రాస్​ఎగ్జామినేషన్ చేయాల్సి ఉన్నా.. రాజస్థాన్‌‌‌‌లోని జైసల్మేర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్న ప్రీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ దఫా విచారణకు హాజరు కాలేకపోయారు. మరోవైపు, శనివారం కాంట్రాక్ట్ సంస్థలను విచారించాలని నిర్ణయించినా అందుబాటులో లేనట్టు తెలిసింది. దీంతో తదుపరి విచారణను జనవరిలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ ఫేజ్‌‌‌‌లో కాంట్రాక్ట్ సంస్థలతో పాటు రామకృష్ణారావును విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.