
సపోర్టింగ్, లీడ్ రోల్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మద్రాస్‌లో పుట్టిన కలైయారసన్ హరికృష్ణన్... ‘మద్రాస్’ సినిమాతో ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యాడు. ఐటీ జాబ్ వదిలేసి, సినిమాల్లో అడుగుపెట్టిన కలై, ఇండస్ట్రీలో మంచి యాక్టర్‌గా పేరు సంపాదించాడు. తమిళంతోపాటు మలయాళంలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న కలై ఇప్పుడు ‘సెంగళమ్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన కెరీర్, పర్సనల్ లైఫ్ జర్నీ గురించి ఆయన మాటల్లోనే....
ఒక యాక్టర్‌గా కథకు ఎంత చేయగలనో అది చేస్తా. అంతకుమించి హీరోయిజం అవసరం లేదనిపిస్తుంది. లీడ్ రోల్స్ విషయానికొస్తే, అవి చేసేటప్పుడు డేట్స్ షూటింగ్, ప్రమోషన్స్ వంటి వాటి గురించి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే సపోర్టింగ్ రోల్స్ చేస్తే ఎలాంటి ఒత్తిడి ఉండదు. కేవలం పర్ఫార్మెన్స్ మీదే దృష్టి పెట్టగలుగుతాం.
‘‘మాది చెన్నై. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా సెయింట్ జాన్స్‌లో జరిగింది. ఆ తర్వాత ఎస్.ఆర్.ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేశా. ఆఖరి ఏడాది చదువుతున్నప్పటి నుంచే సినిమా ట్రయల్స్ మొదలుపెట్టా. కానీ అప్పటికి సినిమా గురించి పెద్దగా తెలియదు. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. వాళ్లలో ఒకడు డాన్స్ నేర్చుకునేవాడు. ఇంకొకరు డైరెక్టర్ కొడుకు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మేం ముగ్గురం కలిస్తే ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. ముగ్గురం కలిసి మూడు షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీశాం. వాళ్లు నన్ను సినిమాల్లో నటించమని ఎంకరేజ్ చేశారు. నిజానికి అప్పుడు నాకు యాక్టింగ్ చేయాలనే ఆలోచనే లేదు.
ఫిల్మ్ కెరీర్
ఒకసారి నేను, నా ఫ్రెండ్ కలిసి ఒక సినిమా ఆడిషన్‌కి వెళ్లాం. వాడు సెలక్ట్ అయ్యాడు, నేను కాలేదు. ఆ తర్వాత ‘అర్జునన్ కాదలై’ అనే సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత, డైరెక్టర్ మిస్కిన్ ఆఫీస్‌కి వెళ్లి ఫొటోలు ఇచ్చా. అలా రోజూ ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాడిని. ఒకరోజు మిస్కిన్‌తో మాట్లాడుతూ, మేం తీసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్పా. అవి చూసి ఆయన సినిమాల్లో ఆడిషన్ చేయించారు. ఫొటోషూట్ చేశాక ‘నందలాల’ సినిమాలో అవకాశమిచ్చారు. ఆ తర్వాతి సినిమా కూడా ఆయనతోనే.. ‘ముగమూడి’లో ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎక్కడ ఆడిషన్స్ జరిగినా ఫ్రెండ్స్ నాకు చెప్పేవాళ్లు. వెంటనే వాటికి ఫొటోలు పంపడం లేదా సెట్‌కి వెళ్లి ఆడిషన్ ఇవ్వడం చేసేవాడిని. ఆ ప్రయత్నాల్లోనే పా. రంజిత్ మొదటి సినిమా ‘అట్టకత్తి’లో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాతి ఏడాది ‘మధ యానై కొట్టమ్’లో చేశా. అయితే, నా యాక్టింగ్ కెరీర్ 2008లోనే ‘అర్జునన్ కాదలై’ అనే సినిమాతో మొదలైందని చెప్పాలి. కానీ, అది కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు.
బ్రేక్ వచ్చింది అప్పుడే
పా. రంజిత్ డ్రామా ఫిల్మ్ ‘మద్రాస్’ (2014)లో అన్బు అనే క్యారెక్టర్లో నటించా. ఈ సినిమాతోనే నాకు గుర్తింపు వచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం ఆడిషన్ అయ్యాక మూడుసార్లు స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత నాకు ఇందులో నటించే అవకాశం ఇచ్చారు. అన్నిసార్లు చేయడానికి కారణం.. ఈ సినిమాలో హీరో కార్తి. ఆయన కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. దాంతో మా సీన్స్ బాగా రావాలంటే పర్ఫార్మెన్స్ బాగుండాలని, అన్నిసార్లు టెస్ట్ చేశారు. ఆ సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టమే. ఒక మంచి సినిమాలో భాగమవ్వడమే కాకుండా, నా యాక్టింగ్‌కి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. నిజం చెప్పాలంటే ఊహించనంత క్రేజ్ వచ్చింది. యాక్టర్‌గా నన్ను గుర్తుపట్టడం అక్కడి నుంచే మొదలైంది. ఒక పాపులర్ ఫిల్మ్ క్రిటిక్ అయితే, ‘కలైయారసన్ తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశారు. ఈ రోల్ తన లైఫ్‌లో గుర్తుండిపోతుంది. ఇంత చిన్న వయసులోనే మంచి క్యారెక్టర్ దొరికింది. డైనమిక్ పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్నాడు’ అని రాశారు. ఆ సినిమాకి ఇలాంటి పాజిటివ్ రివ్యూలు చాలానే వచ్చాయి.
ఆ తర్వాత...
‘మద్రాస్’ తర్వాత నుంచి నా కెరీర్లో అన్నీ మంచి సినిమాలే పడ్డాయి. పా. రంజిత్ డైరెక్షన్లోనే రజినీకాంత్ సినిమా ‘కబాలి’లో స్కూల్ టీచర్‌గా కనిపించా. అదే ఏడాది ‘డార్లింగ్ 2’ అనే కామెడీ హారర్ సినిమాలో లీడ్ రోల్ చేశా. అలాగే ‘రాజ మంతిరి’ అనే సినిమాలో నటించా. ఆ తర్వా త ‘అధే కంగళ్’ అనే సినిమాలో కళ్లు కనిపించని చెఫ్‌గా నటించా. ఆ క్యారెక్టర్ అమెరికన్ చెఫ్ క్రిస్టీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన రోల్ ఇది. ‘ఎయిధవన్, చైనా, పట్టినపక్కమ్, ఉరు’ వంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేశా. పోయినేడాది ‘విక్టిమ్’ అనే ఆంథాలజీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టా. తర్వాత ‘పెట్టైకాలి’ అనే మిస్టరీ, రొమాంటిక్ డ్రామా సిరీస్‌లో నటించా. ఈ ఏడాది వచ్చిన ‘సెంగళమ్’ అనే పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌లో ‘రాయర్’ అనే పాత్ర చేశా. మార్చి 24 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతోంది.
నయనతారతో..
నయనతారతో ‘ఐరా’ సినిమాలో కలిసి నటించా. మొదట్లో ఆమెతో మాట్లాడటానికి కొంచెం ఇబ్బందిపడ్డా. ఆమె పెద్ద హీరోయిన్, నాతో ఫ్రీగా ఉంటారో లేదో అనుకున్నా. కానీ, చాలా సింపుల్‌గా ఉంటారామె. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. తన స్టార్డమ్ యాటిట్యూడ్ ఎక్కడా కనిపించదు. అందువల్ల సీనియర్ నటితో నటిస్తున్నా అనే బెరుకు లేకుండా పర్ఫార్మ్ చేయగలిగా. ఆమె అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సెట్ అంతా ఎలాంటి హడావిడి లేకుండా నార్మల్‌గానే ఉండేది. ‘ఐరా’ మంచి హారర్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఆమెతో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్.
సినిమాల కంటే ముందు
చిన్నప్పటి నుంచీ సినిమాలంటే బాగా ఇష్టం. కానీ, చదువు పూర్తి చేయకుండా సినిమాల్లోకి వెళ్లడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో డిగ్రీ పూర్తి చేసి, ఐటీ జాబ్‌లో చేరా. ఉద్యోగం చేస్తూ సినిమా ట్రయల్స్ కూడా చేశా. ఆడిషన్ ఉన్నప్పుడు ఆఫీస్‌లో పర్మిషన్ అడిగి వెళ్లేవాడిని. కొన్నేండ్ల వరకు మా ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. ఆ తర్వాత ఆడిషన్స్‌కి వెళ్లడం, ఆఫీస్‌లో పనిచేయడం కుదిరేది కాదు. తిండి కూడా సరిగా తినేవాడిని కాదు. దాంతో ఒకరోజు ఇంటికి వెళ్లి అమ్మానాన్నలతో ఆ విషయమే చెప్పా. ‘‘సినిమాల్లో ట్రై చేస్తున్నా.. నాకు నటించడం అంటే ఇష్టం. కాబట్టి నేను పూర్తిగా సినిమాల్లో ట్రై చేస్తా’’ అని చెప్పా. వాళ్లు ‘సరే’ అన్నారు. దాంతో ఆడిషన్స్ అవకాశం రాగానే వెళ్లి నటించడం మొదలుపెట్టా. అలా జాబ్ మానేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చేశా.’’
ఇదే నా ఫ్యామిలీ
నాన్న పేరు హరిక్రిష్ణన్, అమ్మ పేరు తమిళమని. నాకు ఒక బ్రదర్, సిస్టర్ ఉన్నారు. నా భార్యపేరు ప్రియా శంకర్. తను ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 2008లో ఐటీ ఉద్యోగం చేసేటప్పుడు తనని కలిశా. అక్కడ చిగురించిన ప్రేమ 2012లో మమ్మల్ని ఒక్కటి చేసింది. నాకో కూతురు. తన పేరు అదితి. సినిమాల్లో నా మెంటార్.. డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్.
- ‘పెట్టా’ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ క్యారెక్టర్‌కి తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పా.
- ‘టైటానిక్ : కాదలుం కావుంతు పోగుమ్.. ’లో మొదటిసారి డాన్స్ చేశా.
- ‘తంకం’ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చా. ప్రస్తుతం చేసిన ‘2018’ అనే సినిమా ఏప్రిల్ నెలలో రిలీజ్ అయింది.
- ‘చార్లెస్ ఎంటర్ప్రైజెస్’ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది.
- లీడ్ రోల్స్ చేస్తూనే ‘సార్పట్ట’, ‘జగమే తందిరమ్’, ‘తంకం’, ‘ పాత్తు తల’ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కూడా నటిస్తున్నా.
- ‘మద్రాస్’ సినిమాలో నా యాక్టింగ్‌కి వికటన్, విజయ్ అవార్డ్లు వచ్చాయి. అదే సినిమాకు ఫిల్మ్‌ఫేర్, సైమా అవార్డ్లకు నామినేట్ అయ్యా.
- అభిమానులు నన్ను ‘కలై, అన్బు, అర్జున్’ అనే పేర్లతో పిలుస్తారు.
- నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సైక్లింగ్ చేస్తా. బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ బాగా ఆడతా.