ఓ సిటీ వెంచర్ లో ప్లాట్ల వేలం..ఆదాయం కోసం భూములు అమ్ముతున్న కుడా

  • ఆదాయం కోసం మరోసారి భూములు అమ్ముతున్న 'కుడా'
  • మొదటిసారి వేలంలో గజం రూ.7 వేలు.. ఇప్పుడు రూ.లక్షకు పైమాటే
  • ఎదురుగా వరంగల్ కలెక్టరేట్‍.. పక్కనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ 
  • గ్రేటర్‍ అంతటా పెద్దపెద్ద హోర్డింగులతో ప్రచారం చేస్తున్న సంస్థ
  • వేలం తేదీలను డిసైడ్‍ చేసే పనిలో ఆఫీసర్లు

వరంగల్, వెలుగు: కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) వరంగల్‍ హెడ్‍క్వార్టర్‍లోని 'ఓ సిటీ వెంచర్‍'లోని ప్లాట్లను మరోమారు వేలం వేయనున్నారు. ఇందుకోసం వరంగల్​తోపాటు హైదరాబాద్‍, కరీంనగర్‍ వంటి ఇతర జిల్లాల జనాలను ఆకర్షించేలా గ్రేటర్‍లోని పెద్ద హోర్డింగుల్లో ఫెక్సీలతో జోరుగా ప్రచారం చేపట్టింది. మొదట ఈ నెల 15న ప్లాట్ల వేలం పాట ఉంటుందని చెప్పినా, మరో వారం పాటు దీనిని వాయిదా వేశారు.

3 వెంచర్లతో 'కుడా' రియల్ ఎస్టేట్..

గత ప్రభుత్వ హయాంలో వరంగల్​లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓ సిటీ, మా సిటీ, ఉని సిటీ పేర్లతో వెంచర్లను చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది. వరంగల్ నడిబొడ్డున అజంజాహి మిల్ స్థలాలను ఓరుగల్లు పేరు వచ్చేలా ఓ సిటీ ప్రాజెక్ట్ చేపట్టింది. మొత్తంగా 117 ఎకరాల్లో 835 ప్లాట్లు చేసింది. వీటిని 11 ఫేజుల్లో వేలం వేయనున్నట్లు చెప్పారు. తీరా ఆదాయం కోసమంటూ 706 ప్లాట్లను విక్రయించారు.

రెండో ప్రాజెక్టుగా 2019లో హనుమకొండ నగరానికి 6 _7 కిలోమీటర్ల దూరంలో ఉండే మడిపల్లిలో 'మా సిటీ' పేరుతో వెంచర్ మొదలుపెట్టారు. ఇందులో ఏకంగా 300 ఎకరాల్లో 2000 ప్లాట్లు చేశారు. మొదటిసారి 80 ప్లాట్లు విక్రయించగా, 2022 నవంబర్​లో రెండోసారి 98 ప్లాట్లను అమ్మారు. మూడో ప్రాజెక్టుగా 2023 ఆగస్ట్ లో ఉనికిచర్ల గ్రామ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన 'ఉని సిటీ' వెంచర్ స్టార్ట్ చేశారు. 135 ఎకరాల స్థలంలో మొదటగా 10 ఎకరాలను డెవలప్ చేసి 56 ప్లాట్లు విక్రయించారు. 

పాలకవర్గం మీటింగ్‍.. 

ఈ నెల 15న ఓసిటీ వేలం పాట ఉంటుందని కుడా మొదట ప్రచారం చేసింది. కాగా, దీనిని వారం పాటు వాయిదా వేశారు. సెప్టెంబర్‍ లో కుడా లేఔట్ డీపీ నంబర్ 36/2007 (ఆర్సీ 30. 21/22/468/2023) పేరుతో కమర్శియల్ కాంప్లెక్సులు, మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లకు అనువుగా 1000, 2000 చదరపు గజాల ప్లాట్లు విక్రయించనున్నట్లు ప్రభుత్వం తరఫున ప్రకటన ఇచ్చారు. 117 ఎకరాల వెంచర్లో ఇప్పటికే 12 దశల్లో 905 ప్లాట్లు విక్రయించినట్లు చెబుతున్నారు. కాగా, ముందస్తుగా చెప్పినట్లు 11 ఎకరాల 27 గుంటల్లో 33 కమర్శియల్ ప్లాట్లు చేయాలా లేక మునుపటిలా 200, 300 గజాల చొప్పున విక్రయించాలా అనేదాంతోపాటు పలు అంశాలపై సోమ, మంగళవారాల్లో కుడా పాలకమండలి పెద్దలు, అధికారులు సమావేశం కానున్నారు. 

కొత్త కలెక్టరేట్​తో మస్త్ డిమాండ్..

గ్రేటర్ వరంగల్​లోనే హెడ్ క్వార్టర్​గా ఉన్న ఓ సిటీ వెంచర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 8 ఏండ్ల కింద మొదటిసారి వేలం పాటలో రూ.3 వేలకు గజం ధర పెట్టగా, రూ.7_8 వేలకు అటుఇటుగా కొనుగోలు చేశారు. ఇప్పుడు అంతకు రెట్టింపు రేట్లు అయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్‍, జిల్లా మెయిన్‍ బస్ స్టేషన్‍కు అర కిలోమీటర్ దూరం, ప్రముఖుల నివాసాలకుతోడు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కొత్తగా వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం కూడా ఓసిటీ సమీపంలోనే ఉంది. ఓరుగల్లులో ప్రముఖ ఇండస్ట్రీగా రెడీ అవుతున్న కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్​కు వెళ్లేందుకు ఇదే మెయిన్‍ రోడ్‍గా ఉంది. దీంతో గజం సుమారు రూ.లక్షకు పైగానే పలుకుతోంది. దీంతో కుడా పెద్దలు ఆదాయం కోసం ఇక్కడే ప్లాట్లను అమ్మేందుకు రెడీ అయ్యారు.