- గ్రేటర్ వరంగల్‌లో జనవరి 5న ఓ సిటీ ప్లాట్ల వేలం
- ఏర్పాట్లు చేసిన కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ
- మొదటిసారి వేలంతో పోలిస్తే.. 25 రెట్లు పెరిగిన కనీస ధర
వరంగల్, వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (కుడా) ఓ సిటీ ప్లాట్ల వేలం పాటకు జనవరి 5న ముహూర్తం ఫిక్స్ చేసింది. వెంచర్‍లో చేపట్టిన వరంగల్ అజంజాహి మిల్ ప్రాంతంలోని ఓ సిటీ గ్రౌండ్‍లో ప్లాట్లు అమ్మేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. మొదట నవంబర్ 15న ప్రకటించిన అధికారులు ఆపై వాయిదా వేశారు. కాగా, వరంగల్ నడిబొడ్డున ఉన్న వెంచర్ కావడంతో ప్లాట్లకు మస్త్ డిమాండ్ నెలకొంది. మొదటిసారి వేలం పాటలో ప్లాట్లు కొన్న ధర కంటే ఇప్పుడు 10 నుంచి 25 రెట్ల ధర పెరిగింది.
ఓ సిటీ వెంచర్ స్పెషల్
గత ప్రభుత్వం సర్కారు భూములతో గ్రేటర్ వరంగల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఓసిటీ, మా సిటీ, ఉని సిటీ పేర్లతో మూడు వెంచర్లు చేయగా, ఓ సిటీ వెంచర్ మాత్రం హాట్ కేక్‍గా కుడాకు ఆదాయాన్ని సమకూర్చే స్పెషల్ వెంచర్ అవుతోంది. వరంగల్ అజాంజాహి మిల్ ప్రాంతంలో 117 ఎకరాల్లో 835 ప్లాట్లు చేసింది. ఆదాయం కోసం 706 ప్లాట్లు విక్రయించారు. రెండో ప్రాజెక్టుగా 2019లో హనుమకొండ నగరానికి 6 _7 కిలోమీటర్ల దూరంలో ఉండే మడిపల్లిలో 'మా సిటీ' పేరుతో వెంచర్ మొదలుపెట్టారు.
300 ఎకరాల్లో 2000 వేల ప్లాట్లు చేశారు. మొదటిసారి 80 ప్లాట్లు విక్రయించగా, 2022 నవంబర్‌లో రెండోసారి 98 ప్లాట్లను అమ్మారు. మూడో ప్రాజెక్టుగా 2023 ఆగస్ట్ లో ఉనికిచర్ల గ్రామ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన 'ఉని సిటీ' వెంచర్ స్టార్ట్ చేశారు. 135 ఎకరాల స్థలంలో మొదటగా 10 ఎకరాలను డెవలప్ చేసి 56 ప్లాట్లు విక్రయించారు. అయితే మూడింటిలో ఓ సిటీలో మాత్రం ప్లాట్ల వేలం వేసిన ప్రతిసారి ధరలు అంతేస్థాయిలో పెరుగుతూ కుడాకు కాసుల పంటగా మారుతోంది.
అప్పుడు గజం రూ.3 వేలు.. ఇప్పుడు రూ.75 వేలు
గ్రేటర్ లోనే వరంగల్ హెడ్ క్వార్టర్‌గా ఉన్న ఓ సిటీ వెంచర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆదాయ వనరుగా మారింది. 8 ఏండ్ల క్రితం తొలిసారి వేలం పాటలో కుడా అధికారులు గజం ధర రూ.3 వేలుగా నిర్ణయించగా, రూ.7_8 వేలకు అటుఇటుగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు జనవరి 5న నిర్వహించబోయే వేలం పాటలో 45 ప్లాట్లు వేలం వేసేలా ఏర్పాట్లు చేశారు. కనీస ధర మాత్రం ఎవరూ ఊహించని రీతిలో శ్రీమంతులకు మాత్రమే అందే ధరకు చేరింది. ఎదురుగా వరంగల్ కలెక్టరేట్, పక్కనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రావడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ALSO READ : తెలంగాణలో తగ్గుతున్న అడవి
మొదటి దఫా రూ.3 వేలు ఉన్న ధర ఈసారి తూర్పు, దక్షిణ తూర్పు, దక్షిణ పశ్చిమ దిక్కు ప్లాట్లకు అమాంతం రూ.75 వేలకు మినీమం రేటు పెట్టారు. పడమర దిక్కు స్థలాలకు గజం రూ.70 వేల కనీస ధర నిర్ణయించారు. వేలంలో పాల్గొనేవారు పోటీ పడితే ధర అంతకంతకు పెరగనుంది. ఈసారి సీరియల్ నంబర్ 312 నుంచి 739 మధ్యన మొత్తం 45 ప్లాట్లు విక్రయానికి ఏర్పాట్లు చేయగా, ఇందులో తక్కువలో తక్కువ 722 నంబర్ ప్లాటు 173 గజాలు ఉండగా, 739 నంబర్ ప్లాట్ సైజ్ అత్యధికంగా 353 గజాలు ఉంది.