ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. బుమ్రాను వెనక్కి నెట్టి నెం.1 బౌలర్‌గా సఫారీ స్పీడ్ స్టర్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ సత్తా చాటాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. నిన్నటి వరకు టాప్ ర్యాంక్ లో ఉన్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సఫారీ బౌలర్ వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రబడ బంగ్లాదేశ్ పై  జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో 300 వికెట్లు పూర్తి చేసుకొని బంతుల పరంగా వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ గా నిలిచాడు. 

మరోవైపు బుమ్రా ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో విఫలమయ్యాడు. ఈ కారణంగానే టీమిండియా స్టార్ పేసర్ ర్యాంకింగ్స్ లో వెనక పడ్డాడు. బంగ్లాతో టెస్టుకు ముందు నాలుగో స్థానంలో రబడ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకాడు. బుమ్రాతో పాటు జోష్ హేజిల్‌వుడ్, రవిచంద్రన్ అశ్విన్‌ల దాటి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. 2018 జనవరిలో తొలిసారిగా అగ్ర స్థానాన్ని అందుకున్న ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్.. 2019 లో చివరిసారి నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగాడు.

ప్రస్తుత టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే రబడ తొలి స్థానంలో ఉండగా.. హేజిల్‌వుడ్, బుమ్రా, అశ్విన్ వరుసగా రెండు, మూడు , నాలుగు స్థానాల్లో నిలిచారు. జడేజా రెండు స్థానాలు దిగజారి 8 వ స్థానంలో ఉన్నాడు. ఈ వారం అతి పెద్ద విషయం ఏంటంటే.. ఇంగ్లాండ్ పై సంచలన ప్రదర్శనతో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ నోమన్ అలీ 8 స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్ కు చేరుకున్నాడు. పూణే టెస్టులో భారత్ పై 13 వికెట్లు తీసుకున్న న్యూజిలాండ్‌ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 30 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి చేరుకున్నాడు.