తెలంగాణ స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నది : మంత్రి జూపల్లి కృష్ణా రావు

  • పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ అరాచకాలే: జూపల్లి
  • ఓ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయింది
  • కాంగ్రెస్ వచ్చాకే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్నయ్ వెలుగు’తో మంత్రి ఇంటర్వ్యూ

నాగర్​కర్నూల్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు చూశామని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఏం ఆశించి తెలంగాణ సాధించుకున్నామో.. అవేవీ నెరవేరలేవని తెలిపారు. ఓ కుటుంబం.. రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం సృష్టించిందన్నారు. అందినకాడికి దోచుకుని రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ‘‘ప్రగతిభవన్ గేట్లు బంద్ జేసి.. అడ్డంగా పెట్టిన బారికేడ్లు చూసినం.

ఆరు నెలలకోసారి కూడా కేసీఆర్ సెక్రటేరియెట్​కు రాలేదు. ఉద్యమ సమయంలో ధూంధాం పాటలతో మార్మోగిన ధర్నా చౌక్​ను బంద్ పెట్టిన్రు. ప్రతి నెలా జీతం కోసం ఉద్యోగులు, టీచర్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన్రు. రైతుబంధు కోసం ప్రభుత్వ భూములు అమ్ముకున్న దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిన్రు..’’అని బీఆర్ఎస్ పాలనపై జూపల్లి మండిపడ్డారు. ‘వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక కామెంట్లు చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని బొంద పెట్టిన్రు

ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టిన ఓ కుటుంబ పాలన చెర నుంచి.. తెలంగాణ సమాజం బయటపడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నదని జూపల్లి అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కటి సరి చేస్తున్నం. భవిష్యత్ మరింత బాగుంటది. ఓ కుటుంబం చేసిన పాపాన్ని యావత్ తెలంగాణ మోస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన రూ.8లక్షల కోట్ల అప్పుకు ప్రతి నెలా రూ.6వేల కోట్ల వాయిదాలు చెల్లిస్తున్నం.

రూ.70వేల కోట్లు వడ్డీ కింద కడ్తున్నం. తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే.. అప్పులు ఎందుకు అయినయ్? కూలే కాళేశ్వరం కట్టినందుకా? పాలమూరును పెండింగ్​లో పెట్టినందుకా? సీఎంను కలుద్దామంటే ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ దొరకదు. ప్రతిపక్షాలు, సొంత పక్షం అనే తేడా లేకుండా ఎవరినీ మాట్లాడనియ్యలే.. పెత్తందారి పోకడలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ప్రజాస్వామ్యం అనిపించుకుంటాయా?’’అని జూపల్లి బీఆర్ఎస్​ను నిలదీశారు. 

రైతులకు పెద్దపీట వేసినం

రైతులు, వ్యవసాయంపై రూ.54 వేల కోట్ల పైచిలుకు నిధులు ఖర్చుచేసిన రాష్ట్రం ఏదీ లేదని మంత్రి జూపల్లి అన్నారు. ‘‘55 వేల ఉద్యోగాలు, 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలు ఏర్పాటు చేసినం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటుకు పునాది రాయి వేసినం. విద్య, వైద్య రంగాలను మరింత తీర్చిదిద్ది పేద, మధ్య తరగతి వర్గాలు కార్పొరేట్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేసినం.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలే. రైతులకు పరిహారం ఇవ్వలేదు. కుర్చీ వేసుకుని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానన్న పెద్ద మనిషి నిజ స్వరూపం బయటపడ్డది. ఈ ప్రాజెక్ట్​ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నరు’’అని జూపల్లి అన్నారు.