కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి : జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, వెలుగు: ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, లేదంటే చర్యలు తప్పవని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రజాపాలన పారదర్శకంగా ఉండాలని, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇప్పటికీ కొన్ని కార్యాలయాల్లో పైసలు ఇవ్వనిదే పనులు కాని పరిస్థితి ఉందని, కల్యాణలక్ష్మి చెక్కు కోసం రూ.10 వేల వరకు ఖర్చవుతుందని కొందరు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. డబ్బులు అడిగితే తనకు ఫోన్  చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు రావాలన్నారు. ఇక నుంచి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వారానికి రెండు రోజులు పర్యటిస్తానని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీని తనిఖీ చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. అంతకుముందు సగినేనిపల్లి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తహసీల్దార్  వరలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో లక్ష్మణ్ నాయక్, ఏవో డాకేశ్వర్ గౌడ్, పీఆర్  ఏఈ తేజ ఉన్నారు.