మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : జూపల్లి కృష్ణారావు

  • రూ.4 లక్షల చొప్పున పరిహారం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాడూరు శివారులో కోళ్ల షెడ్​ కూలి చనిపోయిన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన చెన్నమ్మ, రాముడు డెడ్​బాడీలకు నాగర్ కర్నూల్  ఆసుపత్రిలో మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

 అంతకుముందు గాలి వాన బీభత్సంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. బాధితులు అధైర్యపడవద్దని తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం త్వరగా అందేలా చూస్తామని చెప్పారు. 

ఇదిలాఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్​లో  ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, మల్లు రవితో మాట్లాడి గాలివాన బీభత్సంతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు 10 రోజుల్లో  ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు రూ.11 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిమ్మాజీపేట మండలం మారేపల్లి, తాడూరు మండలం ఇంద్రకల్, బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్, తెలకపల్లి గ్రామాలను నేతలు సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఇదిలాఉంటే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్  జిల్లా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆర్డీవో కలగజేసుకొని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.