మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజంపై స్పెషల్​ ఫోకస్ : జూపల్లి కృష్ణారావు

  • అధికారులతో పర్యాటక అభివృద్ధిపై రివ్యూ

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్  జిల్లాలో పర్యాటకరంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పట్టణంలో పిల్లలమర్రి మహావృక్షాన్ని ప్రారంభించారు. మినీ ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి, రామయ్య బౌలిలోని శిల్పారామం, మయూరి ఎకో పార్క్, సూపర్  స్పెషాలిటీ హాస్పిటల్  ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న త్రీ స్టార్​ హోటల్  డిజైన్, నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో టూరిజంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన పర్యాటక అభివృద్ధి పనులన్నీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలమర్రి, మినీ ట్యాంక్ బండ్, పాత కలెక్టరేట్ పరిధిలో నిర్మాణంలో 3 స్టార్ హోటల్, మయూరి ఎకో పార్కులో చేపట్టాల్సిన పనుల ప్రగతిపై ఆరా తీశారు. మయూరి ఎకో పార్కులో చేపట్టే పనులపై అటవీ శాఖ మంత్రితో మాట్లాడి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ కు పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వెంటనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. 

మినీ ట్యాంక్ బండ్ ను కృష్ణా జలాలతో  నింపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. శిల్పారామంలో మహిళా సంఘాలు, చేతి వృత్తుల వారు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లలమర్రిలో ల్యాండ్ స్కేప్ తో పాటు ఫౌంటేన్, పిల్లల పార్క్, ఇతర అభివృద్ధి పనులను చేపట్టాలని ఆదేశించారు.

టూరిజం సర్క్యూట్​ ఏర్పాటు చేయాలి..ఉమ్మడి జిల్లాలో నల్లమల అభయారణ్యం, మల్లెలతీర్థం, సోమశిల, ఫరవాబాద్ వ్యూ పాయింట్  వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. సరళ సాగర్, కోయిల్ సాగర్, మన్నెంకొండ, కురుమూర్తి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని వీటన్నింటిని కలిపేలా టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు జిల్లాలో 150 కిలోమీటర్ల నిడివి కలిగిన కృష్ణానది ఉందని, కృష్ణ జలాల్లో వాటర్  స్పోర్ట్స్ తో పాటు బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి టూరిజం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. 

పాలమూరు ఎమ్మెల్యే యెన్నం  శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మయూరి ఎకో పార్కు వెనక హరిత హోటల్  నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కలెక్టర్  విజయేందిర బోయి, అడిషనల్  కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్.మోహన్ రావు, పర్యాటక శాఖ ఎండీ ప్రకాశ్ రెడ్డి, సీఈ వెంకటరమణ, ఈడీ విజయ్, డీఈ పరుష వేది, జిల్లా పర్యటక శాఖ ఇన్​చార్జి యు.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.