జానీకి బెయిలా.. కస్డడీనా..? రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

రంగారెడ్డి: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‎పై తీర్పు వాయిదా పడింది. జానీ కస్టడీ పిటిషన్‎పై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి (సెప్టెంబర్ 25) వాయిదా వేసింది. కాగా, అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‎పై లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ ఈ నెల 19న జానీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. అయితే, కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు జానీని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 

ALSO READ | లైంగిక వేధింపుల కేసు: జానీ బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

ఈ పిటిషన్‎పై ఇవాళ (సెప్టెంబర్ 24) విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విని తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో జానీని పోలీసుల కస్టడీకి అప్పగిస్తుందా లేదా అని కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఇదే రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు జరగనున్నాయి. దీంతో జానీ కస్టడీకి వెళ్తారా.. బెయిల్ లభిస్తుందా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.