సండే రోజు ఆఫీస్​లో ఏం పని?

  • బాలానగర్  తహసీల్దార్​ ఆఫీస్​ను తనిఖీ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే
  • ప్రైవేట్  వ్యక్తులను ఎందుకు రానిచ్చారని ఆర్ఐపై ఆగ్రహం
  • ఉన్నతాధికారులకు, పోలీసులకు కంప్లైంట్

బాలానగర్, వెలుగు : ‘ఇవాళ ఆదివారం. ఆఫీస్​కు సెలవు. ఈ టైంలో ఆఫీసుకు లోపల తాళాలు వేసి ఏం పనులు చేస్తున్నారు? ప్రైవేట్  వ్యక్తులను లోపలికి ఎందుకు రానిచ్చారు?’ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆర్ఐపై ఫైర్  అయ్యారు. మహబూబ్​నగర్  జిల్లా బాలానగర్  మండలంలోని తహసీల్దార్​ ఆఫీసులో ఆర్ఐ వెంకట్ రెడ్డి కొందరు ప్రైవేట్ వ్యక్తులతో భూ లావాదేవీలకు సంబంధించి పనులు చేయిస్తున్నాడు. 

ఆదివారం ఆఫీసుకు సెలవు కావడంతో, అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఉండడం, ఆర్ఐ కూడా అక్కడే ఉండడంతో అనుమానం వచ్చిన చుట్టు పక్కల వారు ఎమ్మెల్యేకు సమాచారం అందించారు. ఆయన వెంటనే ఆఫీస్​ తనిఖీ చేశారు. ఆ టైంలో ఆర్ఐతో పాటు మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు భూ లావాదేవీలకు సంబంధించిన పనులు చేస్తుండగా, ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. 

సెలవు రోజు ఆఫీసులో ఏం పనులు చేస్తున్నారంటూ ఆర్ఐని ప్రశ్నించారు. ఆయన తడబడుతూ సమాధానం చెబుతుండడంతో అక్కడి నుంచే కలెక్టర్​కు ఫోన్ చేసి మాట్లాడారు. సెలవు రోజు ఆర్ఐ బయటి వ్యక్తులతో ఆఫీసులు చేయిస్తున్నాడని, ఆయన్ను సస్పెండ్  చేయాలని చెప్పారు. అలాగే స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశారు.