AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్

ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ తో పాటు ఆస్ట్రేలియా సైతం తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే కంగారులను ఈ సిరీస్ చాలా కీలకంగా మారింది. భారత్ తో చివరి నాలుగు బోర్డర్ గవాస్కర్ సిరీస్ లు కోల్పోవడమే ఇందుకు కారణం. అయినప్పటికీ ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. నవంబర్ 22-26 తేదీలలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ సారి టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా లేనందుకు హేజిల్‌వుడ్ సంతోషం వ్యక్తం చేశాడు. అతను ఉంటే క్రీజులో ఎక్కువ సమయం గడిపి బౌలర్లను అలసిపోయేలా చేస్తాడని ఈ ఆసీస్ బౌలర్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి పుజారా చివరి రెండు ఆస్ట్రేలియా పర్యటనలలో అద్భుతంగా రాణించినా అతనికి స్థానం దక్కకపోవడం విచారకరం. 2018-19లో పుజారా 74.42 సగటుతో 521 పరుగులతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారత్ ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. 

Also Read :- హార్దిక్‌కి ఇక్కడ కూడా కెప్టెన్సీ ఇవ్వలేదు

2020-21 పర్యటనలో పుజారా ఏకంగా 928 బంతులను ఎదుర్కొన్నాడు. పుజారా దుర్బేధ్యమైన డిఫెన్స్ ఆసీస్ విజయావకాశాలను భారీగా దెబ్బ తీసింది. 2023 దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి పుజారాకు టెస్ట్ జట్టులో స్థానం దక్కడం లేదు. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది.