BGT 2024-25: భారత్ ఇప్పుడు నిద్ర నుంచి లేచిన సింహం.. సొంత జట్టుకు ఆసీస్ బౌలర్ వార్నింగ్

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసింది. భారత్ 0-3 తేడాతో కివీస్ చేతిలో వైట్ వాష్ అయింది. ఇప్పుడు అందరి చూపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పైనే ఉంది. ఈ సిరీస్ అటు భారత్ కు.. ఇటు ఆస్ట్రేలియాకు అత్యంత కీలకంగా మారింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు ఇరు జట్లు ఆడుతున్న చివరి సిరీస్ ఇదే కావడంతో.. ఫైనల్ కు అర్హత సాధించాలంటే సిరీస్ విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సిరీస్ కు ముందు తాజాగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ భారత జట్టును హైలెట్ చేసి మాట్లాడాడు.  

" భారత్ న్యూజిలాండ్ పై 0-3 తేడాతో సిరీస్ కోల్పోయారు. ఇది ఒకరకంగా మాకు మంచిదే. భారత్ 3-0 తో గెలవడం కంటే 0-3 తేడాతో ఓడిపోవడమే మాకు మేలు. సిరీస్ ఓటమితో కొంత ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. అయితే ఇప్పుడు భారత జట్టు నిద్ర నుంచి లేచిన ఒక దిగ్గజ జట్టుగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది బ్యాటర్లను మేము ఇక్కడ ఔట్ చేశాం. అయితే కొంతమంది బ్యాటర్లు ఇక్కడ ఆడలేదు. వారిని ఎలా ఔట్ చేయాలో మాకు ఖచ్చితంగా తెలియదు". అని హేజిల్‌వుడ్ భారత జట్టుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

ALSO READ : IPL 2025 CSK: జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు.. చెన్నై జట్టుతో ఉండాలని ఉంది: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్

ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.