Afghanistan cricket: ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కోచ్‌గా జోనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ పొడిగింపు

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ జాతీయ జట్టు ప్రధాన కోచ్‌గా జోనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ పొడిగింపును ప్రకటించింది. 2025 వరకు ఆఫ్ఘనిస్తాన్   ప్రధాన కోచ్‌గా జోనాథన్ ట్రాట్ కొనసాగుతాడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ తో ట్రాట్ 30 నెలల ప్రయాణం విజయవంతంగా ముగిసింది. అయితే అతని సమక్షంలో జట్టు అద్భుతమైన విజయాలు సాధించస్తుండడంతో మరో ఏడాది పాటు అతడిని ప్రధాన కోచ్ గా కొనసాగించనుంది. 

ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు టీ20లు.. మూడు వన్డేలు.. రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. వ్యక్తిగత కారణాల వలన ట్రాట్ వన్డేలకు మాత్రమే ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ ఆటగాడు హమీద్ హసన్ ట్రాట్ స్థానంలో  టీ 20, టెస్ట్ మ్యాచ్‌లకు ప్రధాన కోచ్‌గా పని చేయనున్నాడు. 

జోనాథన్ ట్రాట్ పేరుకు ఇప్పుడు పెద్దగా పరిచయం లేకపోవచ్చు గాని ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే ఈ స్టార్ ప్లేయర్ అందరికీ పరిచయమే. ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన బ్యాటర్ గా ఉంటూ నిలకడగా ఆడి జట్టుకి ఎన్నో విజయాలను అందించాడు. 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకున్న ఈ స్టార్ బ్యాటర్.. కోచ్ బాధ్యతలు చేపట్టాడు. 

Also Read:-సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: తెలుగోడిపై జోష్ హాజెల్‌వుడ్ ప్రశంసలు..

2021 లో  ఇంగ్లాండ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ జట్టుకు కోచ్ గా పని చేసాడు. ఆఫ్ఘనిస్థాన్ జట్టుకి కోచ్ గా మారిన ట్రాట్.. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లీష్ జట్టు పరాజయానికి కారణమయ్యాడు. ట్రాట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కోచ్‌గా భాద్యతలు చేపట్టాక ఆ జట్టు ఆటగాళ్లలో ఎంతో పరిణితి కనిపిస్తోంది. వారి ఆడే విధానంలో చాలా మార్పొచ్చింది. చాలా భాద్యతాయుతంగా ఆడుతున్నారు. పేసర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నట్లు కనిపిస్తున్నారు.