రక్తం దొరుకుతలేదు..గద్వాలలో పడకేసిన నేషనల్ హెల్త్ మిషన్

  • హాస్పిటల్​లో 5 యూనిట్లకు మించి బ్లడ్ లేదు
  • పత్తా లేని మొబైల్ బ్లడ్ డొనేషన్ కలెక్షన్
  • జీతాలు తీసుకుంటున్నారే తప్ప వ్యాన్ బయటకు తీయట్లేదు
  • బ్రహ్మాండంగా నడుస్తున్న ప్రైవేటు దందా..!

జోగులాంబ గద్వాల జిల్లాలో నేషనల్ హెల్త్​మిషన్ పడకేసింది. మొబైల్ బ్లడ్ డొనేషన్ కలెక్షన్ పత్తా లేకుండా పోయింది. ఫలితంగా సర్కారు దవాఖానలో ఎమర్జెన్సీ టైమ్​లో బాధితులకు రక్తం దొరకడం లేదు. బ్లడ్ బ్యాంక్ ముసుగులో మాత్రం ప్రైవేటు దందా బ్రహ్మాండంగా సాగుతోంది. 

గద్వాల, వెలుగు: రక్తదానం మహాదానమని ప్రజల్లో చైతన్యం కల్పించి, మొబైల్ బ్లడ్ డొనేషన్ చేయాలనే సంకల్పంతో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద.. జోగులాంబ గద్వాల జిల్లాకు 2018లో ఒక మొబైల్ వ్యాన్, డాక్టర్​తోపాటు ఇద్దరు టెక్నీషియన్లు, ఓ పీఆర్వో, డ్రైవర్​ను ఇచ్చారు. వీరు ప్రతిరోజూ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ మినిమం 30 యూనిట్ల బ్లడ్ ను ప్రజల నుంచి సేకరించాలి. ఇందుకోసం ప్రతినెలా రూ.2.50 లక్షలకు వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కానీ, వీరంతా రొటీన్ క్యాంపులకే పరిమితమై ఎక్కడా బ్లడ్​ డొనేషన్​ చేయడం లేదు. ఏనాడూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించట్లేదు. మరోవైపు, రూ.లక్షలు పోసి కొన్న వ్యాన్ హాస్పిటల్​లో వృథాగా పడి ఉన్నది. 

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు..

నేషనల్ హెల్త్ మిషన్ సక్సెస్ ఫుల్​గా నడవకపోవడంతో గద్వాల గవర్నమెంట్​హాస్పిటల్​లో రక్తం నిండుకుంది. నెలకు 100 నుంచి 150 యూనిట్ల బ్లడ్ అవసరం కాగా, దానికి అనుగుణంగా బ్లడ్​ను స్టోర్ చేయడం లేదు. వారం రోజుల నుంచి ఇక్కడ 5 యూనిట్ల బ్లడ్ కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.10 రోజుల నుంచి ఓ పాజిటివ్ బ్లడ్ కోసం చాలా ఫోన్లు వచ్చినా అవైలబుల్ లేదనే సమాధానం బ్లడ్ బ్యాంక్ నుంచి వస్తున్నది. దీంతో బాధితులు చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు బ్లడ్ బ్యాంక్​ కు వెళ్తున్నారు. అదే ఎన్ హెచ్ఎం కింద ప్రతిరోజూ బ్లడ్ యూనిట్లు తీసుకుని వస్తే ఈ సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రైవేటు వ్యక్తుల కోసమేనా..?

ప్రైవేటు వ్యక్తుల కోసమే గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్​లో బ్లడ్ బ్యాంక్​ను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఆరుగురు డాక్టర్లు, మరో ముగ్గురు కలిసి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వారి బిజినెస్ ఇంప్రూవ్ ​చేసుకోవడానికే ధర్మాస్పత్రిలో నిలువలు లేకుండా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేటులో ప్రాసెసింగ్ ఫీజులు కింద రూ.1,200 నుంచి రూ.1,550 వరకు తీసుకొని ఒక యూనిట్ బ్లడ్​ ప్యాకెట్ ఇవ్వాలి. కానీ, గద్వాలలో అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.   

బ్లడ్ అవసరాన్ని బట్టి క్యాంపులు

జిల్లాకు అవసరమైన బ్లడ్ యూనిట్లను బట్టి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ఎస్ యూ కింద అపాయింట్ అయిన వారు సపరేట్ గా మొబైల్ బ్లడ్ ను కలెక్ట్ చేసేలా చూస్తాం. ఎక్కువ అవసరం ఉంటే బ్లడ్ ను క్యాంపు ల ద్వారా తీసుకుంటాం. ప్రైవేటు బ్యాంక్ నుంచి బ్లడ్ తెప్పించడం లేదు . 

-  డాక్టర్ వినోద్ ఇన్ ఛార్జి సూపరింటెండెంట్