కారు షోరూమ్​లలో 2 లక్షల జాబ్స్‌‌ పోయాయ్‌‌

కారు షోరూమ్​లలో 2 లక్షల జాబ్స్‌‌ పోయాయ్‌‌

ఆటోరంగానికి గడ్డుకాలం

భారీగా పడిపోయిన అమ్మకాలు

ఖాళీగా కనిపిస్తున్న షోరూమ్‌‌లు

అప్పులు పుట్టక ఇబ్బందులు

ఆటోమొబైల్‌‌ రంగం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గుతుండటం ఒక సమస్య అయితే కొనేవారికి ఫైనాన్స్‌‌ దొరక్కపోవడం మరో సమస్యగా మారింది. వెహికిల్‌‌ షోరూమ్‌‌లు వెలవెలబోతున్నాయి. దీంతో డీలర్లు ఉద్యోగుల సంఖ్యను విపరీతంగా తగ్గిస్తున్నారు. గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా రెండు లక్షల మందిని తొలగించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పట్లో ఆటోమొబైల్‌‌ రంగం కోలుకునే అవకాశాలు లేవు కాబట్టి మరిన్ని షోరూమ్‌‌లు మూతబడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరింత మంది ఉపాధి కోల్పోవడం తప్పదని ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆటోమొబైల్‌‌ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కోరింది. లేకపోతే ఆటోమొబైల్‌‌ పరిశ్రమ కోలుకోవడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్ష్‌‌రాజ్‌‌ చెప్పారు. ‘‘ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సేల్స్‌‌ సిబ్బందే ఎక్కువ. పరిస్థితి ఇలాగే కొనసాగితే టెక్నికల్‌‌ సిబ్బందిపైనే వేటేయడం తప్పకపోవచ్చు. ఎందుకంటే అమ్మకాలు తక్కువైతే, సర్వీసింగ్‌‌ అవసరాలూ తగ్గుతాయి’’ అని ఆయన వివరించారు.

ఇప్పటికే 271 షోరూమ్‌‌లకు మూత

మనదేశంలో దాదాపు 15 వేల మంది డీలర్లు 26 వేల షోరూమ్‌‌లను నడుపుతున్నారు. వీటిలో 25 లక్షల మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 25 లక్షల మందికి ఉపాధి దొరుకుతోంది. గత 18 నెలల్లో దేశవ్యాప్తంగా 271 షోరూమ్‌‌లు మూతబడటంతో అందులో పనిచేసే 32 వేల మంది ఉద్యోగాలు పోయాయి. మరిన్ని షోరూమ్‌‌లు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయని ఫాడా చెబుతోంది. అమ్మకాలపై డీలర్లు అందే మార్జిన్‌‌ను కంపెనీలు గత కొన్నేళ్లుగా పెంచకపోవడంతో డీలర్లు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాలకు కోతపెడుతున్నారు. ఎన్నికల తరువాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డా, బడ్జెట్‌‌ను కూడా ప్రవేశపెట్టినా ఆటోమొబైల్‌‌ రంగం మాత్రం కోలుకోవడం లేదని ఆశిష్‌‌ పేర్కొన్నారు.

ఆగని అమ్మకాల పతనం

గత ఎనిమిది నెలలుగా వాహనాల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ (సియామ్‌‌) లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌‌–జూన్‌‌ క్వార్టర్‌‌లో అమ్మకాలు 12.35 శాతం తగ్గి రూ.60.85 లక్షల యూనిట్లకు పడిపోయాయి. 2018లో ఇదే క్వార్టర్‌‌లో దాదాపు 70 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫాడా లెక్కలను చూస్తే..ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌లో రిజిస్ట్రేషన్లు ఆరు శాతం తగ్గి 51.16 లక్షలుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో 54 లక్షల వాహనాలు రిజిస్టర్‌‌ అయ్యాయి. మిగతా సెగ్మెంట్ల కంటే ప్యాసింజర్‌‌ వెహికిల్స్ అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. మనదేశంలోని అతిపెద్ద వాహన సంస్థ మారుతీ సుజుకీ అమ్మకాలు జూలైలో 36 శాతం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. మిగతా కంపెనీల పరిస్థితీ ఇలాగే ఉంది. దీనిపై మారుతీ అధికారులు స్పందిస్తూ దేశీయ మార్కెట్లో డిమాండ్‌‌ తగ్గుతోందని, అమెరికా వంటి దేశాల చర్యల వల్ల దిగుమతులూ తగ్గుతాయని తెలిపింది. దీర్ఘకాలంలో మాత్రం అమ్మకాలు బాగుండవచ్చని పేర్కొంది.

ఎందుకీ దుస్థితి ?

వరుసగా గత ఎనిమిది నెలల నుంచి వాహనాల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. డీలర్‌‌షిప్‌‌లు మూతబడుతున్నా యి. ఉద్యోగులను ఇంటికి
పంపుతున్నారు.

ఎలక్ట్రిక్‌‌ వాహనాల వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం డీజిల్‌‌, పెట్రో వాహనాలను ప్రోత్సహించడం లేదు. అందుకే జీఎస్టీ ఎక్కువ వసూలు చేస్తోందని ఆటోమొబైల్‌‌ రంగం చెబుతోంది.

కొత్త కాలుష్య నిబంధనలు అమల్లోకి రావడం, వాటికి తగ్గ ఇంజన్లను తయారు చేయడానికి కంపెనీలు మరింత ఖర్చు చేశాయి. ఫలితంగా ధరలు ఇంకా పెరిగాయి.

ఉబర్​, ఓలా వంటి ట్యాక్సీ అగ్రిగ్రేటర్ సర్వీసులు వచ్చాక, కార్ల కొనుగోళ్లు మందగించాయి. వీటి రేట్లు పోటాపోటీగా ఉండటంతో సొంత వాహనాలకు బదులు క్యాబ్‌‌లను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది.

ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌ దివాలా తీసిన తరువాత బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు వాహన తయారీ కంపెనీలకు అప్పులు ఇవ్వడాన్ని తగ్గించాయి. వినియోగదారులకూ వెహి కిల్‌‌ ఫైనాన్స్ దొరకడం కష్టమవుతోంది.