న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘నెక్స్ట్’ అమ్మకాలను ప్రారంభించింది. గూగుల్, జియో ఈ మేడ్-ఫర్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేశాయి. రిలయన్స్ రిటైల్, జియోమార్ట్ డిజిటల్ స్టోర్స్, జియో డాట్‌కామ్ లేదా వాట్సప్ మెసేజ్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఫోన్‌ను కొనటానికి ముందుగా జియో సైట్‌లో లేదా వాట్సాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం పేరు, మొబైల్ నంబర్‌ను ఇవ్వాలి. వెరిఫికేషన్ కోసం ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్ కోసం 7018270182కు 'హాయ్' అని పంపితే చాలు. అయితే కస్టమర్ తాను ఉన్న ప్రాంతం వివరాలు ఇవ్వాలి. ఫోన్ అందుబాటులో ఉన్న సమీప స్టోర్ గురించి వివరాలను జియో పంపిస్తుంది. బుకింగ్ అయిన తర్వాత, సమీపంలోని జియో స్టోర్‌కు వెళ్లి ఫోన్‌ను తీసుకోవచ్చు. ఫోన్ ఎంట్రీ ధర రూ. 1,999 కాగా, మిగిలినది ఈఎంఐల ద్వారా చెల్లించవచ్చు. ఫోన్‌ను నేరుగా కొనాలనుకుంటే రూ.6,499 చెల్లించాలి. జియో ఫోన్లో డ్యూయల్ సిమ్ ఉంటుంది కానీ డేటా మాత్రం జియో సిమ్ కార్డ్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాయిస్ కాలింగ్ కోసం ఇతర సర్వీస్ ప్రొవైడర్ల సిమ్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్, 5.5 ఇంచుల డిస్‌ప్లే, 13 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఇది ప్రగతి ఓఎస్‌పై పనిచేస్తుంది.
