జార్ఖండ్‌‌ రాంచీలో దారుణం

 జార్ఖండ్‌‌ రాంచీలో దారుణం

రాంచీ: ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తాము పవిత్రంగా భావించే చెట్లను నరికేస్తున్న వ్యక్తిని గ్రామస్తులంతా కలిసి కొట్టి చంపేశారు. తరువాత డెడ్‌‌బాడీకి నిప్పుపెట్టారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ సిండేగా జిల్లాలోని చప్రిదీప గ్రామంలో మంగళవారం జరిగింది. ఆదివాసీలు పవిత్రంగా పూజించే చెట్లను గ్రామానికి చెందిన సంజు ప్రదాన్  నరికేశాడు. ఆ చెట్లను నరకొద్దని గ్రామస్తులు హెచ్చరించినా వినలేదు. ఇంతకుముందు కూడా ఇలాగే చెట్లను కొట్టేస్తే గ్రామస్తులు పోలీసులకు కంప్లైంట్​ చేశారు. ఇటీవల కూడా సంజూ అదే పని చేయడంతో దీనిపై మాట్లాడడానికి రావాలని గ్రామస్తులు ఆయనను పిలిచారు. అయితే ఆ మీటింగ్‌‌కు సంజూ వెళ్లలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు అతన్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చారు. బెస్రాజరా గ్రామశివారులో మీటింగ్ జరిగే ప్రాంతానికి దగ్గరలోని మార్కెట్ వద్దకు తీసుకొచ్చి దారుణంగా కొట్టి చంపారు. ఆపై డెడ్​బాడీని తగలబెట్టే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, డెడ్‌‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 500 మంది ఈ దాడిలో పాల్గొని ఉండొచ్చని తెలిపారు. మరణించిన వ్యక్తిపై మూడు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు ఉన్నాయని, అతను సీపీఐ (మావోయిస్టు) గ్రూప్ మెంబర్ అని కొలెబిరా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చెప్పారు. ఇటీవలే బెయిల్‌‌పై రిలీజ్ అయ్యాడన్నారు.