జార్ఖండ్ రైతులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 50 వేల వరకు ఉన్న రైతు రుణమాఫీ పరిధిని రూ. 2 లక్షల వరకుపెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను 2024–25 సంవత్సరానికి చెందిన బడ్జెట్ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ లో రూ. 50 వేల వరకు రైతు రుణ మాఫీని అమలు చేస్తుంది. ఇప్పుడు రుణమాఫీకి దరఖాస్తులు తగ్గడంతో .... రుణమాఫీ పరిధిని పెంచే యోచనలో ఉంది.
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ పథకాన్ని ప్రవేశపెడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 51 వేల నుంచి రూ. లక్ష లోపు వరకు రుణాలు తీసుకున్న రైతులు 3 లక్షల మంది ఉన్నారు. లక్ష నుంచి 2 లక్షల వరకు లోన్ తీసుకున్న రైతులు లక్ష మంది ఉన్నారు. ఈ రుణ మాఫీ పథకానికి రూ. 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని రాష్ట్రప్రభుత్వం అంచనావేస్తుంది.
జార్ఖండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంక్ అధికారులతో రైతు రుణమాఫీ పెంపు అంశాన్ని చర్చిస్తున్నారు. నాన్ పెర్ఫార్మింగ్ ఖాతా (NPA)లను ప్రామాణికంగా చేయాలని బ్యాంక్‌లను కోరుతున్నారు. ఆ ఖాతాలకు సంబంధించి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 50 వేల రూపాయిల లోపు రుణం తీసుకున్న NPA ఖాతాదారులకు కూడా లబ్ధి చేకూరనుంది.వ్యవసాయ రుణమాఫీ పథకంలో జార్ఖండ్ లో ఇప్పటి వరకు 4 లక్షల 72 వేల 117 మంది రైతులు లబ్ధి పొందారు. 2021 సంవత్సరం నుంచి జార్ఖండ్‌లో రుణమాఫీ పథకం అమల్లో ఉంది.
