నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష

నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్స్  పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న IIT,NITల్లో, వచ్చే ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఈ సారి నాలుగు విడతల్లో పరీక్ష నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. అర్హులైన విద్యార్థులు ఇవాళ్టి ( మంగళవారం) నుంచి 2021 జనవరి 15 దాకా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు, రోజుకు రెండు సెషన్స్‌లో ఆన్‌లైన్‌లో JEEమెయిన్స్‌ మొదటి విడత పరీక్ష నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్‌, మేలో మరో మూడు విడతల్లో పరీక్షలు జరపనున్నట్లు NTA తెలిపింది.

ఇవాళ్టి నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జాతీయ పరీక్ష ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌ (JEEమెయిన్‌, NTA,NIC,IS) ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే మెయిన్స్‌ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు భాషను ఎంచుకునే అవకాశముంటుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, భాషను మార్చుకునే అవకాశం ఉండదు. JEE మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌లో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యా బోర్డుల జోక్యానికి అవకాశం ఉండదని NTA స్పష్టం చేసింది. వివిధ బోర్డుల సిలబస్‌ హేతుబద్దీకరణ కోణంలో, ప్రతి పేపర్‌లో రెండు విభాగాలుగా ప్రశ్నాపత్రాలను ఎన్‌టీఏ రూపొందిస్తుంది. అకాడమిక్ ఇయర్ ను వృథా చేయకుండా, మొదటి ప్రయత్నంలో మెరుగైన స్కోర్‌ సాథించని విద్యార్థులకు, మరికొన్ని అవకాశాలు ఇచ్చేలా పరీక్షా షెడ్యూల్‌ను రూపొందించారు. ఏదైనా కారణాలతో పరీక్షకు హాజరు కాని వారు, మరో విద్యాసంవత్సరం వరకు వేచి చూడకుండా, మిగతా మూడు విడతల పరీక్షల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.