కుక్కల దాడిలో జవహర్ నగర్ బాలుడు మృతి..కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళన

మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ లో మంగళవారం వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు విహన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక దివ్యాంగుల కాలనీకి వచ్చిన జవహర్ నగర్ మున్సిలప్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డిని నిలదీశారు. జవహర్ నగర్ లోవీధి కుక్కల బెడద నివారించాలని గతంలో ఎన్నిసార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేరశారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:ఎయిర్పోర్ట్లో మెకానిక్ ఉద్యోగాలు.. బారులు తీరిన నిరుద్యోగులు..  

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో మంగళవారం (జూలై 16) ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. బాలుడిని ముండ్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లి వీధి కుక్కలు తీవ్రంగా గాయపర్చాయి.  విహాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వీధి కుక్కల దాడిలో బాలుడి తల భాగంలో, ఒంటిపై తీవ్ర గాయాయ్యాయి. శరీరం ఇన్ఫెక్షన్ కు గురై మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. 

వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ పాలకులు అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రెండు నెలల క్రితమే వికలాంగుల కాలనీకి వచ్చినట్లు బాలుడు తండ్రి భరత్ తెలిపారు. రాత్రి ఆడుకుంటూ బయటికి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసి చాలా దూరం ఈడ్చుకెళ్ళినట్లు తెలిపారు. వీధి కుక్కల స్వైర విహారం కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.