గూడెంలో ఏం జరుగుతోందో ఎస్పీకి తెలియదా?

  • ఈశ్వరమ్మ కేసులో నిందితులకు కఠినంగా శిక్షించాలి
  • ఏ సమస్య ఉన్నాకాల్​ చేయండి 
  • చెంచుగూడెంలో పర్యటన
  • దవాఖానలో బాధితురాలిని పరామర్శించిన జాతీయ 
  • ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్

కొల్లాపూర్, వెలుగు : ఈశ్వరమ్మపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ ​హుస్సేన్ నాయక్  డిమాండ్ చేశారు. ఆదివారం కొల్లాపూర్  మండలం మొలచింతలపల్లిలోని చెంచుగూడెంలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈశ్వరమ్మ గుడిసెను పరిశీలించి, దాడిపై అక్కడి గిరిజనులను వివరాలడిగి తెలుసుకున్నారు. తమపై దౌర్జన్యం చేసి భూములు గుంజుకుంటున్నారని చెంచులు ఆయనకు చెప్పుకున్నారు. ఈశ్వరమ్మపై దాడి చేసిన వారిలో ఇద్దరిని తప్పించారని చెప్పారు.

వెట్టిచాకిరీ చేయించుకుటున్నారని, చిత్రహింసలు పెడుతున్నారని హుస్సేన్​నాయక్​ముందు వాపోయారు. హుస్సేన్​నాయక్​ మాట్లాడుతూ అడవిలో నుంచి 80 చెంచు కుటుంబాలను గ్రామాల్లోకి తీసుకువచ్చి 25 ఏండ్లు గడుస్తున్నా, వారికి కేటాయించిన భూములకు పట్టాలివ్వలేదన్నారు. చెంచులకు రైతుబంధు కూడా పడడం లేదంటే ప్రభుత్వం, అధికారులు ఏవిధంగా పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆర్డీటీ అనే స్వచ్ఛంద సంస్థ కట్టిన ఇండ్లు తప్పించి చెంచులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదన్నారు.

ఈశ్వరమ్మపై దాడి కంటే ముందే భూతగాదాతో అదే  కుటుంబానికి చెందిన చెంచు నాగయ్యను చంపేశారన్నారు. పోలీసులు మాత్రం ఈ కేసును ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్నారని ఆరోపించారు.  చెంచుగూడెంలో జరిగే ఘటనలు ఎస్పీకి, ఇక్కడి పోలీసులకు తెలియదా? అని ఫైర్ ​అయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చెంచులకు రక్షణ కల్పించాలన్నారు.

ఘటనపై నాగర్​కర్నూల్ కలెక్టర్ తో మాట్లాడి చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్  చేయాలని సూచించారు. వెంట ఎస్పీ వైభవ్​ గైక్వాడ్, డీఎస్పీ శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, శ్రీనివాస్ యాదవ్, మూలే భరత్, మల్లేశ్, సీఐ మహేశ్, ఎస్ఐలు హృషికేశ్, రామన్ గౌడ్ పాల్గొన్నారు.

ఈశ్వరమ్మకు పరామర్శ

నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్​ హుస్సేన్ నాయక్ ఆదివారం పరామర్శించారు. కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి ఆమెతో మాట్లాడారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి సూపరింటెండెంట్ రఘు వివరించారు. ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కల్యాణ్ నాయక్, డీఎఫ్ వో రోహిత్ గోపిడి పాల్గొన్నారు.

నిమ్స్​కు తరలింపు 

నాగర్​కర్నూల్​దవాఖానలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మకు ఆదివారం రాత్రి ఫిట్స్ రావడంతో  హైదరాబాద్​లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ అందే మెరుగైన వైద్యంతో బాధితురాలు త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు.