IND vs AUS 3rd Test: ఒక్కడే వారియర్‌లా: బ్రిస్బేన్ టెస్టులో బుమ్రాకు 5 వికెట్లు

బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. తన ఫాస్ట్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా కొత్త బంతితో చక చక వికెట్లు తీసి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 7 వికెట్లు పడితే బుమ్రా ఒక్కడే 5 వికెట్లు తీయడం విశేషం. సహచర ఫాస్ట్ బౌలర్లు విఫలమవుతున్నా బుమ్రా ఒక్కడే బౌలింగ్ లో పోరాడుతున్నాడు. 

ఈ రోజు తొలి సెషన్ లో  ఆస్ట్రేలియాకు బుమ్రా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ తొలి బంతికి అద్భుతమైన బంతితో ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికీ నాథన్ మెక్‌స్వీనీ (9)ని బుమ్రా బోల్తా కొట్టించాడు. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతితో బుమ్రా విశ్వరూపం చూపించాడు. సెంచరీ హీరో స్టీవ్ స్మిత్(101), భారీ సెంచరీతో జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (152) ను ఔట్ చేశాడు. ఈ రెండు క్యాచ్ లు రిషబ్ పంత్ అందుకున్నాడు. ఇదే ఊపులో మిచెల్ మార్ష్ ను ఔట్ చేసి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 

Also Read : టీమిండియాపై అరుదైన రికార్డ్.. 535 రోజుల తర్వాత స్మిత్ సెంచరీ

బుమ్రా చెలరేగినా మిగిలిన బౌలర్లు విఫలం కావడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (43), స్టార్క్ (2) క్రీజ్ లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ 152 పరుగులు.. స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోర్ అందించారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, నితీష్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు.