Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?

ఫిబ్రవరి నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా వైస్ కెప్టెన్ గా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో అతనికి డిప్యూటీగా ఎవరు ఎంపికవుతారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. హార్దిక్ పాండ్య, శుభమాన్ గిల్ రేస్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రాను వైస్ కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. 

2024 శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ కు యువ బ్యాటర్ శుభమాన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే గిల్ ఏమంత గొప్ప ఫామ్ లో లేడు. అతనికి కెప్టెన్సీ అనుభవం కూడా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ యువ ఆటగాడికి వైస్ కెప్టెన్సీ అప్పగించే సాహసం బీసీసీఐ చేయదనే వార్తలు వస్తున్నాయి. బుమ్రా ప్రస్తుతం వెన్ను  గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తి స్థాయిలో కోలుకుంటే బుమ్రాకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నారట. 

ALSO READ | Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం.. ఛాంపియన్స్ ట్రోఫీకి డౌట్

బుమ్రా టెస్ట్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో కూడా అతని అనుభవం భారత్ కు ఉపయోగపడుతుంది. ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. అతని సారధ్యంలో భారత్ తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.  త్వరలోనే ఐసీసీ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.