ఐసీసీ టెస్ట్‌‌ ర్యాంకింగ్స్‌‌లో నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌లోనే కొనసాగుతున్నా బుమ్రా

దుబాయ్‌‌ : టీమిండియా స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా.. ఐసీసీ టెస్ట్‌‌ ర్యాంకింగ్స్‌‌లో నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌లోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో బుమ్రా కెరీర్‌‌ బెస్ట్‌‌ రేటింగ్‌‌ పాయింట్లు (908) సాధించాడు. ఆసీస్‌‌తో ఐదో టెస్టుకు ముందే ఇండియా తరఫున అత్యధికంగా రేటింగ్‌‌ పాయింట్లు (907) ఖాతాలో వేసుకున్న ఇండియన్‌‌ పేసర్‌‌ మరో పాయింట్‌‌ పెంచుకున్నాడు. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌‌లో రెండు వికెట్లు తీయడంతో ఈ ఘనత అందుకున్నాడు.

స్పిన్నర్‌‌ రవీంద్ర జడేజా (745), బోలాండ్‌‌ (745)తో కలిసి సంయుక్తంగా 9వ ర్యాంక్‌‌లో కొనసాగుతున్నాడు. ఆసీస్‌‌ కెప్టెన్‌‌ ప్యాట్‌‌ కమిన్స్‌‌ (841) ఒక స్థానం  మెరుగై రెండో ర్యాంక్‌‌లో నిలిచాడు. బ్యాటింగ్‌‌లో యశస్వి జైస్వాల్‌‌ (847) నాలుగో ర్యాంక్‌‌లో ఉండగా, రిషబ్‌‌ పంత్‌‌ (739) మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌‌కు దూసుకొచ్చాడు. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (631), విరాట్‌‌ కోహ్లీ (614) వరుసగా 23, 27వ ర్యాంక్‌‌ల్లో ఉన్నారు.