భారత్‌తో టెస్ట్ సిరీసే ఆస్ట్రేలియాకు ముఖ్యం.. మమ్మల్ని పట్టించుకోలేదు: పాకిస్థాన్ హెడ్ కోచ్

ప్రపంచ క్రికెట్ మొత్తం ప్రస్తుతం బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కు ఈ సారి భారీ హైప్ నెలకొంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కోసం నెల రోజుల ముందే ఆస్ట్రేలియా మీడియా ఈ సిరీస్ కోసం ప్రత్యేక కథనాలు రాసుకొస్తుంది. ఓ వైపు స్వదేశంలో పాకిస్థాన్ తో వన్డే జరుగుతున్నప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్ దృష్టి మాత్రం భారత్ తో టెస్ట్ సిరీస్ పైనే ఉంది.
 
వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా ఓడిపోయింది. స్వదేశంలో రెండు సార్లు ఓడిపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో స్వదేశంలో ఎలాగైన ఈ సారి భారత్ ను ఓడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కు వస్తున్న హైప్ చూసి పాకిస్థాన్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీ షాక్ అవుతున్నాడు. 

ALSO READ | Mohammed Shami: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. రంజీ ట్రోఫీ ఆడనున్న షమీ

ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో గిలెస్పీ మాట్లాడుతూ."నిజాయితీగా చెప్పాలంటే క్రికెట్ ఆస్ట్రేలియా మా వన్డే సిరీస్‌ను ప్రమోట్ చేయకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. వారు ఇండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుంది". అని పాక్ కోచ్ తెలిపాడు. ఇటీవలే పాకిస్థాన్ ఆస్ట్రేలియాలో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తేడాతో  గెలుచుకుంది. దీంతో 22 ఏళ్ళ తర్వాత ఆసీస్ గడ్డపై పాకిస్థాన్ వన్డే సిరీస్ గెలిచింది.