జీన్స్, టీషర్టులు వేసుకురావొద్దు.. చెప్పులొద్దు, షూసే వేసుకోవాలి. ఫార్మల్స్‌లో రావాలి.. ఇన్‌షర్ట్ చేసుకోవాలి. ఆడాళ్లయితే చుడీదార్లు లేదంటే ఫార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి’ ఇవీ కొన్ని కంపెనీలు, కాలేజీలు పెడుతున్న షరతులు. ఇప్పుడు జపాన్‌లోని కొన్ని కంపెనీలు ఓ వింత రూల్ పెట్టాయి. కళ్లద్దాలు పెట్టుకుని ఆఫీసుకు రావొద్దంటున్నాయి. ఆ రూల్ కూడా కేవలం ఆడవాళ్లకే. దానికి వాళ్లు చెబుతున్న కారణమేంటో తెలుసా..? ఒక్కో కంపెనీ ఒక్కో కారణం చెబుతోంది. ఉదాహరణకు షాప్ అసిస్టెంట్లనుకోండి.. వచ్చిపోయే కస్టమర్లకు చెడ్డ ఇంప్రెషన్ పడిపోతుందట.
బ్యూటీ రంగంలో అయితే.. ఆ ఎంప్లాయీ అందం సరిగ్గా కనిపించకుండా అద్దాలు డామినేట్ చేస్తాయట. ఎయిర్‌లైన్ ఎంప్లాయీస్ విషయంలో ‘భద్రత’ అనే సాకు చూపిస్తున్నారు. రెస్టారెంట్ల వాళ్లు ఏం చెబుతున్నారో తెలుసా.. సంప్రదాయ జపాన్ డ్రెస్సులకు అద్దాలు సూటవ్వవట. ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో కారణం చెప్పి కళ్లద్దాలను బ్యాన్ చేయడంతో ఆడాళ్లు రగిలిపోతున్నారు. ఇప్పుడు ఆ దేశంలో దీనిపై హాట్ హాట్ చర్చే నడుస్తోంది.
పిచ్చి పిచ్చి కారణాలు చూపించి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. ఎప్పటివో పాత కాలపు రూల్స్ పట్టుకుని ఇప్పుడు తమపై రుద్దాలని చూస్తే ఊరుకోబోమంటున్నారు. ఇది లింగ వివక్షేనని అంటున్నారు. #GlassesAreForbidden హ్యాష్‌ట్యాగ్ పేరిట నెట్టింట వైరల్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మధ్యే అదే జపాన్‌లో హైహీల్స్ వేసుకుని జాబ్‌కు రావాలన్న రూల్‌పై పెద్ద దుమారమే రేగింది. #KuToo పేరిట పెద్ద ఆన్లైన్ ఉద్యమమే నడిచింది.

