అంబేద్కర్ ఉద్యమ కెరటం ఎల్ఎన్ ​హర్​దాస్

  • జనవరి 6న ఎల్ఎన్  ​హర్​దాస్ జయంతి

అత్యల్పకాలం జీవించినా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయేవారు  కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారిలో మొదటి వరసలో ఉండేవ్యక్తి ఎల్ఎన్​ హర్ దాస్​.  ఆయన  జీవించిన కాలం 35 ఏండ్లు మాత్రమే. ‘జై భీమ్- బల్ బీమ్’.. నినాదం ఇచ్చిన  లోకప్రియ బాబు హర్ దాస్​​ లక్ష్మణ్ రావు నగరాలే.  నేడు  ఆయన 121వ  జయంతి.  మహారాష్ట్ర  నాగపూర్  జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో గల కామటి పట్టణం బైల్ బజార్ బస్తీ (ప్రస్తుత బాబు హర్​దాస్​ ఎల్ఎన్ నగర్)లో  6 జనవరి 1904 న  జన్మించారు. ఆయనని  ప్రేమగా  లోకప్రియ,  బాబుజీ  అని పిలుచుకునేవారు. 1921లో అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలించేందుకు నాటి అంటరాని జాతుల్లో చైతన్యాన్ని రగిలించేందుకు 18 ఏండ్ల వయసులోనే  మహారట్ట అనే వారపత్రికను స్థాపించారు.  

ఈ పత్రిక అస్పృశ్యులను  చైతన్యపరిచేందుకు తోడ్పడింది.  అగ్ర కులస్తులు అస్పృశ్యులను దేవాలయాల లోపలికి ప్రవేశించననీయకపోవడం వలన1925లో కామటి బైల్ బజారు ఖలశిలైన్​లో అంటరానివారి కోసం దేవాలయం నిర్మించారు.  బాబా సాహెబ్ 8 ఆగస్టు 1930 ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్​ని స్థాపించాడు.  ఈ ఫెడరేషన్​కి  సంయుక్త కార్యదర్శిగా  బాబు హర్ దాస్​ను  నియమించారు. 

జై భీమ్- బల్ భీమ్!

1933లో అకోలా సభకు అధ్యక్షత వహిస్తున్న బాబు హర్ దాస్​ ప్రసంగిస్తుండగా మధ్యలో ఆయనకు ఒక టెలిగ్రామ్ అందింది. అందులోని విషయం ‘స్టార్ట్​ ఇమ్మిడియెట్లీ. సన్​ ఎక్స్​పైర్డ్’ అని ఉంది. ఇలాంటి విషయం తెలియగానే బాధితులు దుఃఖితులై  వెంటనే వెళ్ళిపోతారు.  కానీ,  సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి,  నిజమైన అంబేద్కర్ వాది, సమతా సైనిక్ దళ్ సైనికుడు అయిన హర్​దాస్​​ తన కొడుకు మరణించినా  సమావేశాన్ని వదిలి కామటికి వెళ్లలేదు.  ‘నేను ఇంత విశాల ప్రజాసమూహన్నీ విడిచి రాలేను.  

దహన సంస్కారాలు చేయండి’ అని టెలిగ్రామ్ పంపాడు.  కామటి ప్రాంతంలో అంటరాని కులాల సామాజిక ఉన్నతికోసం ఉద్యమిస్తూ డాక్టర్ అంబేద్కర్ తలపెట్టిన మహద్  చెరువు పోరాటంలో పాల్గొంటూనే కామటి ప్రాంత సమతా సైనిక్ దళ్ నాయకునిగా బాబు హర్​దాస్​​ కొనసాగాడు. మరోపక్క  నాసిక్ పట్టణంలోని 3 మార్చి 1930న ప్రారంభమైన సత్యాగ్రహంలో సమతా సైనిక్ దళ్ సైనికులు ప్రతిరోజు 125 మంది పురుషులు, 25 మంది స్త్రీలు పాల్గొనేవారు. ఇంకా 8,000 మంది సత్యాగ్రహంలో పాల్గొనేందుకు పేర్లను నమోదు చేసుకున్నారు. 

సత్యాగ్రహ సమతా సైనిక్ దళ్ సైనికులలో ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు 6 జనవరి 1935న సత్యాగ్రహులకు హర్​దాస్​ ఒక ఉత్తరం పంపాడు. అందులో ఎవరైనా ఎదురుపడితే ‘జై భీమ్’ అని పలకరించాలి.  ‘బల్ భీమ్’ అని ప్రతిగా అభివాదం చేయాలి అని రాశాడు.  ఇలా లోకప్రియ ఇచ్చిన నినాదం  నేడు  దేశం ఎల్లలు దాటి  ప్రపంచం  నలుమూలల  ప్రతిధ్వనిస్తోంది.   

సామాజిక ఉద్యమాలలో అవిశ్రాంత పోరాటం చేస్తూ వ్యక్తిగత జీవితం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక ఆయన టీబీ వ్యాధితో  12 జనవరి 1939న  తుదిశ్వాస విడిచారు.  లోకప్రియ  మరణవార్త తెలుసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్​.. తన  కుడి భుజం కోల్పోయానని దుఃఖించాడు. జై భీమ్ నినాదం ప్రతిధ్వనిస్తున్నంత కాలం లోకప్రియ హర్ దాస్​ లక్ష్మణరావు నగరాలే  సజీవంగా ప్రజల నాలుకలపైన  జై భీమ్ నినాదం రూపంలో బతికే ఉంటాడు. ఆయన కలలు కన్న సమాజం నిర్మించేందుకు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.  

 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-దాసరి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్-