దీపమే.. దైవం!..జనవరి 2నుంచి జంగుబాయి అమ్మవారి జాతర

  •     ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో పుణ్యక్షేత్రం
  •     ఆదివాసీల అరుదైన ఆరాధన.. ప్రత్యేక పూజలు
  •     వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తుల రాక  
  •     నెల రోజుల పాటు పూజలందుకోనున్న అమ్మవారు

ఆసిఫాబాద్,వెలుగు :ప్రకృతితో ఆదివాసీలకు విడదీయరాని బంధం ఉంది. అడవే జీవనాధారం. భాష.. వేషధారణ.. పూజలు.. పండుగలు... ఇలా ప్రతి అంశంలోనూ వీరి జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. ఏడాది పొడవునా ప్రకృతి దేవతలను ఆరాధిస్తుంటారు. పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని దర్శించుకోవడం ఆదివాసీలకు ఆనవాయితీ. అమ్మవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తుంటారు. నెల వంక కనిపించిన వేకువజామున ప్రారంభమయ్యే జాతర ఈసారి రేపట్నుంచి షురువవుతుంది. నెల రోజుల పాటు కొనసాగుతుంది. 

గుహలో కొలువైన అమ్మవారు

తెలంగాణ – -మహారాష్ట్ర సరిహద్దులోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహరాజ్ గూడ  సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో సహజసిద్ధంగా కొలువైన జంగుబాయి అమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.  వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా జాతరను నిర్వహిస్తుంటారు.  మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలైన గొండులు, పర్దాన్, కోలాం తెగలకు చెందిన ప్రజలు దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రంలో 8 గోత్రాల కటోడాలు(పూజారులు) సంప్రదాయం ప్రకారం కఠిన నియమాలతో జాతర పూర్తయ్యే దాకా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. 
 
దీపోత్సవంతో జాతర షురూ

 ఎనిమిది గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో ముందుగా దీపోత్సవంతో ప్రారంభిస్తారు.  తుమ్రం, కొడప, సలాం , రాయిసిడాం,హెర్రె కుమ్ర, మరప, వెట్టి, మందడి.. ఇలా ఎనిమిది గోత్రాల కటోడాలు (పూజరులు) తొలిరోజు కాలినడకన పూజా సామగ్రి తీసుకెళ్లి అదే రోజు రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు పూజలు కొనసాగిస్తుంటారు.  జాతర జరిగే రోజుల్లో ఆదివాసీలు ఉదయం తమ ఇండ్ల ముందు ఆవుపేడతో అలుకు చల్లుతారు. ఇంటి ఆవరణలోకి చెప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

చెప్పులు కూడా వేసుకోరు. నేలపైనే పడుకుంటారు. మద్యం అసలే ముట్టుకోరు. కనీసం హోటల్లో నీటిని కూడా ముట్టుకోరు.  ఇంటి నుంచి కాలినడకన  ఆలయానికి చేరుకుం టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సి వస్తే గంపను నేలపై ఉంచ కుండా మూడు బండలను పేర్చి గో మూత్రంతో శుభ్రం చేసిన తర్వాత రాళ్లపై పెడతారు. జాతరకు వెళ్తూ మధ్యలో టోప్లకస(కోనేరు) లో పుణ్యస్నానాలు చేసి ఆలయానికి చేరుకుంటారు. 

 నైవేద్యం, పూజలు ఇలా..

ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు  నువ్వుల నూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వుల నూనె, నెయ్యి ,ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరికాయ, ఆగరవర్తులు,చంద్రం , గుగ్గిలం, కుంకుమ, గులాలు, వంట సామగ్రి పెట్టుకుని  సంప్రదాయ వాయిద్యాలతో తరలివెళ్తారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు.

అనంతరం మైసమ్మ, పోచమ్మ , రావుడ్క్ వద్ద మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకుం టారు. రాత్రి వంటలు చేసుకుని భోజనాలు చేసి పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు.  జాతర పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఆచారాలను పాటిస్తారు. 8 గోత్రాల పూజారులను కలుస్తారు. గంపను నెత్తిపై పెట్టుకుని ఇంటిదారి పడతారు. ఆడపడుచులు  ఎదురుపడి దుస్తులను పరుస్తే కానుకలు సమర్పిస్తూ దాటుకుంటూ వెళ్తుంటారు .

దర్శించుకోవాలంటే.. ఇలా వెళ్లాలి 

ఆసిఫాబాద్ నుంచి వెళ్లే భక్తులు కెరమెరి మండల కేంద్రం మీదుగా దేవాపూర్, అనార్ పల్లి, కొండి బాగుడా, మలంగి, మాలేపూర్ నుంచి ఉమ్రి క్రాస్ రోడ్ మీదుగా పరందోళి, మహరాజ్ గూడ చేరుకుని, అక్కడ్నుంచి 2 కిలోమీటర్లు పోతే అమ్మవారి ఆలయం వస్తుంది. ఆదిలాబాద్ నుంచి వచ్చే భక్తులు ఉట్నూరు, నాన్నూర్, లోకారి మీదుగా ఉమ్రి క్రాస్ రోడ్ నుంచి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్ గా నాన్నూర్, కొత్తపల్లి, మాలేపూర్ మీదుగా ఉమ్రి క్రాస్ రోడ్ నుంచి పరందోళి, మహరాజ్ గూడ ద్వారా  వెళ్లొచ్చు.