తిరుమలలో డిక్లరేషన్పై పవన్ సంతకం.. ఎందుకు చేశారంటే..

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిక్లరేషన్పై సంతకం చేశారు. టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కల్యాణ్ చిన్న కూతురు పొలెనా అంజనీ కొణిదెల సంతకం చేసింది. అయితే.. ఆమె మైనర్ కావడంతో టీటీడీ నిబంధనల ప్రకారం కన్న తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెంట ఆయన ఇద్దరు కుమార్తెలు వెళ్లారు. డిక్లరేషన్ పై సంతకాలు చేసిన వీడియోను జనసేన పార్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

తిరుమల డిక్లరేషన్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనానికి వెళ్లే అన్య మతస్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించే ముందు ఈ డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేయాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధన. టీటీడీ నిబంధనల ప్రకారం హిందువులు కాని వారు తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ పత్రాలపై తప్పనిసరిగా సంతకం చేయాలి. వెంకటేశ్వర స్వామిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆ డిక్లరేషన్ పత్రాల్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇటీవల.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్న సందర్భంలో డిక్లరేషన్పై చర్చ జరిగింది. 

Also Read:-వరద సాయం విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే..

డిక్లరేషన్ పై జగన్ సంతకం చేసి తీరాల్సిందేనని టీడీపీ, సీఎంగా ఐదేళ్ల పాటు శ్రీవారికి వస్త్రాలు సమర్పించిన తనను ఆలయంలో ప్రవేశించకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నారని జగన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తన మతం మానవత్వమని, డిక్లరేషన్లో రాసుకుంటే రాసుకోండని జగన్ చెప్పారు. తిరుమల వెళ్లొద్దని జగన్ కు ఎవరూ చెప్పలేదని, తిరుమల వెళ్లకుండా ఉండటానికి జగన్కు ఏ సాకులు ఉన్నాయో తెలియదని చంద్రబాబు మీడియాతో అన్నారు. ఎవరైనా దేవుడి ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించి తీరాల్సిందేనని జగన్ డిక్లరేషన్ వివాదంపై చంద్రబాబు కరాఖండిగా చెప్పిన విషయం విదితమే.