న్యూఢిల్లీ: ఊహించినట్టే జరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరపు చివరి క్వార్టర్‌లో (జనవరి–మార్చి) ఇండియా జీడీపీ 3.1 శాతం మాత్రమే పెరిగింది. దీంతో పూర్తి ఏడాదికి జీడీపీ గ్రోత్ 4.2 శాతం మాత్రమే ఉంది! గత ఎనిమిదేళ్లలో జీడీపీ ఇంతగా తక్కువ పెరగడం ఇదే మొదటిసారి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2018–19 లో మన ఎకానమీ 6.1 శాతం గ్రోత్ సాధించిన విషయం తెలిసిందే. 2019–20 క్యూ 4 లో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) కూడా ఇంచుమించుగా జీడీపీ తరహాలో, అంటే మూడు శాతమే పెరిగింది. ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే క్యూ 4 లో పన్ను వసూళ్లు తగ్గిపోయాయన్న మాట. ఇక పూర్తి ఏడాదికి జీవీఏ 3.9 శాతం పెరిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు క్వార్టర్ల గ్రోత్‌ను.. క్యూ1 లో 5.2 శాతం, క్యూ 2 లో 4.4 శాతం, క్యూ 3 లో 4.1 శాతానికి మార్చారు. మార్చి చివరివారంలో లాక్‌డౌన్ మొదలైంది. తాజా ఫలితాలను బట్టి ఇక ముందు క్వార్టర్లలో ఎకానమీ పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, మార్చి లో విధించిన లాక్‌డౌన్ వల్ల కొన్ని ఆర్థిక సంస్థల నుంచి డేటా రావడానికి ఇబ్బందులు ఎదురైనట్లు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ పనితీరును అంచనా వేయడానికి 2019–20 లెక్కలు సాయపడతాయి. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ పనితీరు ఎలా ఉంటుందో ఒక అవగాహనకు రావడం వీలవుతుంది. లాక్‌డౌన్ ప్రభావం ఎకానమీపై ఎంత ఉందనేది ఈ ఏడాది మొదటి క్వార్టర్ పనితీరు ద్వారా తెలుస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో మొదటి క్వార్టర్లో గ్రోత్ ఉండదనే అంచనాలు ఉన్నాయి. కాకపోతే, ప్రతి కూల వృద్ధి (నెగటివ్ గ్రోత్) లోకి జారే అవకాశాలూ లేకపోలేదని ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం క్యూ1 లో ఎకానమీ 45 శాతం కుదించుకుపోతుందని ఎకానమిస్టులు అంటున్నారు. రెండో విడత ఎడ్వాన్స్‌డ్ ఎస్టిమేట్స్ 2020 ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ 5 శాతం ఉంటుందని లెక్కగట్టాయి.
సెప్టెంబరు వరకు ఇబ్బందులు తప్పవా ?
లాక్‌డౌన్ సమస్యల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు ఇప్పటికే కేంద్రం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ను ప్రకటించింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. చిన్న, మధ్యతరహా కంపెనీలకు క్రెడిట్ గ్యారంటీ స్కీము ప్రకటించారు. తన వంతుగా ఆర్‌బీఐ రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించి 4 శాతానికి పరిమితం చేసింది. మార్కెట్‌కు డబ్బు అందించడంతోపాటు మారటోరియంను మరో మూడు నెలలపాటు పొడగిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. జనానికి, వ్యాపారాలకు తగినంత డబ్బు తేవడానికే ఈ ప్రయత్నమని పేర్కొంది. సప్లై సమస్యలు, డిమాండ్ తగ్గుదల ఎకానమీని గట్టి దెబ్బే కొట్టాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతవారం చెప్పిన విషయం తెలిసిందే.
సర్వీస్ సెక్టార్‌కు భారీగా నష్టాలు
టూరిజం, ఏవియేషన్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలు భాగమైన సర్వీస్ సెక్టార్‌కు లాక్‌డౌన్ వల్ల పెద్ద దెబ్బ పడింది. ఈ సెక్టార్‌లోని కంపెనీల్లో వేల మంది ఉద్యోగాలు పోయాయి. ఎకానమీకి ఎంతో ముఖ్యమైన చిన్న, మధ్యతరహా కంపెనీలకూ ఇబ్బందులు తప్పలేదు. లాక్‌డౌన్ వల్ల ఇవి ఎంతో నష్టపోయాయి. అప్పటికే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న కన్‌స్ట్రక్షన్ రంగం క్రైసిస్‌లో కూరుకుపోయింది. నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. 2019–20 చివరి క్వార్టర్లో నిర్మాణ రంగం 2.2 శాతానికి కుదించుకుపోయింది. మాన్యుఫాక్చరింగ్ కూడా 1.4 శాతం తగ్గింది. 2019–20 పూర్తి ఏడాదికి చూస్తే మాన్యుఫాక్చరింగ్ రంగంలో గ్రోత్ ‘జీరో’ గా నమోదైంది. ఇక ట్రేడ్, హోటల్స్ భాగమైన హాస్పిటాలిటీ సెక్టార్ కేవలం 2.6 శాతం గ్రోత్ సాధించింది. రబీ పంట బాగుండటంతో నాలుగో క్వార్టర్లో వ్యవసాయ రంగం మాత్రం 5.9 శాతం గ్రోత్ సాధించింది. 2019–20 లో గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కూడా 2.8 శాతం మేర తగ్గింది. ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గుతున్నాయనడానికి ఇది సంకేతం. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ నాలుగో క్వార్టర్లో 2.9 శాతానికి పడిపోయింది. లాక్‌డౌన్‌తో అర్బన్ ప్రాంతాలలో డిమాండ్ బలహీనపడటమే దీనికి కారణం.
ఏప్రిల్ 2020లో 38 శాతం తగ్గిన కోర్‌సెక్టార్ అవుట్‌పుట్
ఎనిమిది కీలక రంగాలు భాగంగా ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అవుట్‌పుట్ 2020 ఏప్రిల్‌లో 38.1 శాతం తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌనే ఇందుకు కారణం. అంతకు ముందు ఏడాది అంటే ఏప్రిల్ 2019 లో ఈ ఎనిమిది కీలక రంగాలూ 5.2 శాతం వృద్ధి సాధించాయి. కామర్స్ మినిస్ట్రీ శుక్రవారం ఈ డేటా విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ వంటి ఎనిమిది కీలక రంగాల అవుట్‌పుట్ 9 శాతం కుదించుకుపోయింది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో కోల్, సిమెంట్, స్టీల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ, క్రూడ్ ఆయిల్ వంటి పరిశ్రమల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది.
