IPL 2025 Mega Auction: స్టోక్స్ ఔట్.. మెగా ఆక్షన్‌లోకి 42 ఏళ్ళ ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక పేసర్ చరిత్ర సృష్టించి ఘనంగా వీడ్కోలు పలికాడు. ఆటకు వీడ్కోలు పలికిన వెంటనే టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ మెంటార్‌ గా  బాధ్యతలు చేపట్టాడు. అండర్సన్ తనకు టీ20 క్రికెట్ ఆడాలని ఉందనే కోరికను ఇటీవలే బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అతను ఐపీఎల్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెగా వేలం నుంచి తప్పుకున్నాడు. 

ఇంగ్లాండ్ లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ తో పాటు ప్రపంచంలోని అన్ని టీ20 లీగ్ లు ఆడాలనుకున్నట్లు ఈ ఇంగ్లీష్ బౌలర్ ఇదివరకే  తెలిపాడు. అయితే 42 ఏళ్ళ వయసులో ఈ పేసర్ ను ఫ్రాంచైజీలు పట్టించుకుంటారో లేదో చూడాలి. అతను చివరిసారిగా 2014 టీ20 బ్లాస్ట్ ఫైనల్ లో ఆడాడు. మొత్తం 44 టీ20 మ్యాచ్‌ల్లో 8.47 ఎకానమీతో 41 వికెట్లు పడగొట్టాడు.బెన్ స్టోక్స్ జాతీయ జట్టును దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతను చివరిసారిగా 2023 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. 

ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24 మరియు 25 తేదీల్లో రెండు రోజుల పాటు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరగనుంది. ప్లేయర్ వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు (1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు) సైన్ అప్ చేసారు. ఈ జాబితాలో 320 క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 30 అసోసియేట్ నేషన్స్ ప్లేయర్‌లు ఉన్నారు.