బనకచర్లను ఆపండి: అనుమతులు లేకుండా, నీటి వాటాలు తేలకుండా ఎట్ల కడ్తరు?

  • బ్యాక్ వాటర్ సమస్యను తేల్చిన తర్వాతే పోలవరం పనులు చేపట్టాలి 
  • భద్రాచలంలో ముంపు బాధితులకు ఆర్అండ్ఆర్ప్యాకేజీతో పాటు రిటైనింగ్ వాల్ కట్టాలి
  • ఏపీకి రాష్ట్ర సర్కార్ లేఖ.. గోదావరి,కృష్ణా బోర్డులు, జలశక్తి శాఖకూ లెటర్

హైదరాబాద్, వెలుగు: లింక్​కమ్ లిఫ్ట్​ప్రాజెక్టు బనకచర్లను ఆపెయ్యాలని ఏపీకి రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. అనుమతుల్లేకుండా, నీటి వాటాలు తేలకుండా ప్రాజెక్టులు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం బ్యాక్ వాటర్​తో ఎదురయ్యే ముంపు సమస్యను తేల్చే వరకు.. ఆ ప్రాజెక్టు పనులను కూడా మొదలుపెట్టవద్దని చెప్పింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఏపీ ప్రభుత్వానికి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరుతూ గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు జలశక్తి శాఖకు కూడా లెటర్ రాశారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతుల్లేవని, అసలు నీటి తరలింపుపై ఏపీ స్పష్టత ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.

నీటి వాటాలపై క్లారిటీ లేకుండా ఒక బేసిన్​ నుంచి తీసుకుంటూ ఇంకో బేసిన్​లో కలుపుతామంటూ గందరగోళం సృష్టించే ప్రయత్నం మానుకోవాలని సూచించింది. ప్రస్తుతం కృష్ణా జలాలకు సంబంధించి కేడబ్ల్యూడీటీ 2లో వాదనలు నడుస్తున్నాయని, అవి తేలిన తర్వాత నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. రివర్ ​బోర్డులకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో సమస్య ముదరకముందే చర్యలు తీసుకోవాలని, ఏపీకి ఆదేశాలివ్వాలని కోరింది. ఇక పోలవరం బ్యాక్​వాటర్​తో భద్రాచలం ముంపునకు గురవుతున్నదని తెలిపింది.

బాధితులకు ఆర్అండ్ఆర్​ప్యాకేజీ ఇవ్వడంతో పాటు రిటైనింగ్​వాల్ నిర్మించాలని ఏపీని కోరింది. దాదాపు 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్​ వాల్​ కట్టాల్సి ఉంటుందని చెప్పింది. నిర్వాసితులకు మంచి పరిహారం ఇచ్చాకే పోలవరం పనులను పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. బ్యాక్ వాటర్​తో ముంపు సమస్య అనుకున్న దానికంటే ఎక్కువే ఉంటుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని, అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలొచ్చినా చర్చల ద్వారా పరిష్కారించుకునే వెసులుబాటు ఉందని పేరొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాగు, తాగునీరు కూడా ప్రాధాన్య అంశమని లేఖలో ప్రస్తావించింది. 

రివర్ బోర్డులకు సీడబ్ల్యూసీ లేఖ.. 

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి–-బనకచర్ల లింక్‌‌ ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణా రివర్ బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు బోర్డులకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది.