అతని వల్లే ఈ దుస్థితి.. జగన్ చుట్టూ చేరి చెడగొట్టారు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాలను గెలుచుకోగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాలను ఆ పార్టీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి ఎవరు భాద్యులా..! అని లెక్కలేసుకునే పనిలో పడ్డారు. ఇదిలావుంటే, ఏపీలో వైసీపీ ఘోర ఓటమిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్న జక్కంపూడి రాజా.. ఇలాంటి ఓటమిని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. తండ్రిని మించి ఏదైనా చేయాలని, తన పేరు స్థిర స్థాయిగా నిలిపోవాలని ప్రతిక్షణం వైఎస్‌ జగన్‌ తపన పడేవారని చెప్పుకొచ్చారు. తాను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు తమ సీఎం అని స్పష్టం చేశారు. జగన్‌ గెలిచినా.. ఓడినా రియల్‌ హీరో అని వర్ణించారు. అయితే, తమ అధినాయకుడి చుట్టూ పనికిమాలిన అధికారులు చేరి వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. ఆయనను తప్పుదోవ పట్టించారని రాజా విమర్శించారు.

అతనిదే పెత్తనం

సీఎంవో మాజీ ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డిపై జక్కంపూడి రాజా నిప్పులు చెరిగారు. అతని లాంటి చెత్త అధికారులు జగన్‌ దగ్గర చేరటం వల్ల తాము(ఎమ్మేల్యులు) చాలా ఇబ్బందులు పడ్డామని జక్కంపూడి రాజా వెల్లడించారు. జగన్‌‌ని కలిసే పరిస్థితి ఉండేది కాదని.. ఏదైనా అర్జీ తీసుకెళ్తే ధనుంజయరెడ్డి తానే ముఖ్యమంత్రిలా ఫీలయ్యి తమను గంటల తరబడి కూర్చోబెట్టుకునేవాడని విమర్శించారు.  

సాధ్యం కానీ హామీలు

ఇచ్చిన హామీలలో తమ ప్రభుత్వం 99 శాతం నెరవేర్చిందన్న జక్కంపూడి రాజా.. ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని తెలిపారు. చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారని వాపోయారు. అందునా, వచ్చిన ఫలితాలు నమ్మశక్యంగా లేవని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం తమకు ఉందని అన్నారు.