రిజర్వేషన్లపై బీసీల అనుమానాలు తీర్చండి : జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రిజర్వేషన్లు పెంచుతారా లేదా అనే అనుమానం బీసీల్లో ఉందని, వీటిపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై ఈ నెల10న హైదరాబాద్‌‌లో బీసీ మేధావులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42% సాధించడానికి ఉన్న మార్గాలపై చర్చించి మేధావుల సమావేశంలోనే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. తమ పోరాటం వల్లే సర్కార్ కులగణన చేపట్టిందన్నారు. బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు న్యాయ నిపుణులు, మేధావులు , బీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.