ఎన్ఆర్సీకి మేం వ్యతిరేకం.

ఎన్ఆర్సీకి మేం వ్యతిరేకం.

అమరావతి, వెలుగు:

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్ఆర్ సీ)కు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. మైనార్టీలకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు. ఎన్ఆర్సీకి మద్దతిచ్చేది లేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చేసిన ప్రకటనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తనతో చర్చించాకే అంజాద్ బాషా ప్రభుత్వం తరపున ప్రకటన చేశారని జగన్ అన్నారు. సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఏపీ హై గ్రేడ్ స్టీల్ ప్లాంట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. వచ్చే మూడేళ్లలో రూ.15 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 30 లక్షల టన్నుల కెపాసిటీతో నిర్మించే స్టీల్ ప్లాంట్ తో 25 వేల మందికి పని లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ సప్లయ్ చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్ధాపన చేయడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని పేర్కొన్నారు.

కడప జిల్లాపై చంద్రబాబు వివక్ష

కడప జిల్లాకు సాగునీరు, పరిశ్రమల స్థాపన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే జరిగిందని జగన్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లపాటు కడప జిల్లాపై వివక్ష చూపిందన్నారు. ఓట్ల కోసం సీఎం హోదాలో చంద్రబాబు ఎన్నికలకు 6 నెలల ముందు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని విమర్శించారు. కుందూ – తెలుగు గంగ ఎత్తిపోతల పథకానికి, కర్నూలు – వైఎస్ఆర్‌‌‌‌ కడప జిల్లాల సరిహద్దులో నిర్మించబోయే రాజోలి ఆనకట్ట, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోళదరాశి వద్ద నిర్మించే జలాశయానికి జగన్ శంకుస్థాపన చేశారు. కడపలో రిమ్స్‌‌‌‌ ఆసుపత్రిలో రూ.107 కోట్లతో ఏర్పాటు చేయబోయే క్యాన్సర్‌‌‌‌ ఆసుపత్రి, రీసెర్చ్‌‌‌‌ సెంటర్,  రూ.175 కోట్లతో  నిర్మించే సూపర్‌‌‌‌ స్పెషాలిటీ విభాగం, రూ.40.80 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్‌‌‌‌ ఐ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌కు శంకుస్థాపన చేశారు.

కృష్ణా జలాల్లో సీమ వాటా పెంచుతాం

వెనుకబడిన రాయలసీమకు సాగు నీరు, పరిశ్రమలు తెచ్చేలా కృషి చేస్తామని జగన్ అన్నారు. కృష్ణా జలాల్లో రాయలసీమ వాటాను మరింత పెంచుతామని ప్రకటించారు. గోదావరి వరద నీటి వినియోగం ద్వారా కృష్ణా ఆయకట్టు అవసరాలు తీర్చి, రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇస్తామన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ద్వారా వరద నీటి తరలింపును గరిష్ట స్థాయికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో రాయలసీమలోని చెరువులను కృష్ణా నీటితో నింపి సాగు విస్తీర్ణం భారీగా పెంచబోతున్నట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి వరద జలాలను రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు రూ. 60 వేల కోట్లతో సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది కృష్ణా నది వరదను ఒడిసి పట్టేందుకు రూ. 23 వేల కోట్లతో కాలువల కెపాసిటీ పెంచుతామన్నారు. కేసీ, తెలుగు గంగ ఆయకట్టు స్థిరీకరణ కోసం రూ. 2,234 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.