అమరావతి, వెలుగు: ఏపీలోని 13 జిల్లాలను పరిపాలనకు వీలుగా 25 జిల్లాలకు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని చెప్పారు . పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. శనివారం విశాఖపట్నంలోని వైసీపీ ఆఫీసులో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేలకు తినిపించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టంలోని 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినట్లు చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనుకోవడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. పదేళ్లలో ముంబైకి ధీటుగా విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో చేయలేని అభివృద్ధి, సంక్షేమం, సాహసోపేత నిర్ణయాలను జగన్ 6 నెలల్లో తీసుకున్నారని చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానితో భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు దీనికి సహకరించాలని విజయసాయిరెడ్డి కోరారు
