తాడేపల్లి టు ఇడుపులపాయ - ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. విపక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి దూకుడు చూపిన జగన్, ప్రచారం విషయంలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్లాన్ చేసిన జగన్ బస్సు యాత్రను ప్రారంభించేందుకు తాడేపల్లి నుండి ఇడుపులపాయకు బయల్దేరాడు. అక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించి యాత్ర ప్రారంభించనున్నాడు జగన్. ఆ తర్వాత ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్నాడు.

21రోజుల పాటు సాగనున్న ఈ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నాడు జగన్.ఇడుపులపాయ నుంచి కుమారుని పల్లి, వేంపల్లి, సర్వ రాజుపేట, వీరపునాయునిపల్లి, గంగిరెడ్డి పల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల మీదుగా సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నాడు జగన్. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఈ యాత్ర జరిగే 21రోజుల పాటు జనంలోనే ఉండనున్నారు.