డబుల్ సెంచరీ ప్రభుత్వం: వైసీపీలో జోష్ నింపుతున్న జగన్ కొత్త స్లోగన్

ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం మొదలు పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు జనంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కొత్త స్లోగన్ తో పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. మొన్నటిదాకా వైనాట్ 175 అన్న నినాదంతో ముందుకెళ్లిన జగన్ ఇప్పుడు డబుల్ సెంచరీ ప్రభుత్వం స్థాపించటానికి సిద్ధమా అంటూ కొత్త నినాదం అందుకున్నాడు. గురువారం నంద్యాలలో జరిగిన సభలో జగన్ ఈ నినాదంతో ఆకట్టుకున్నాడు.

నంద్యాల సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేశారు సీఎం జగన్. ప్రజలను చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్తుంటే మాయలమారి పార్టీలన్ని కుట్రలన్నీ చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి అని ఫైర్ అయ్యారు. నరకాసుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారని అన్నాడు జగన్. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోతుందని అన్నారు జగన్. ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది, మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉందని అలోచించి ఓటేయమని ప్రజలను కోరారు. మరోసారి ఫ్యాను గుర్తుకు ఓటేసి 175కు 175అసెంబ్లీ స్థానాలు, 25కు 25ఎంపీ స్థానాలు గెలిపించి డబుల్ సెంచరీ సర్కారును స్థాపించాలని అన్నారు జగన్. జగన్ కొత్త నినాదం వైసీపీ క్యాడర్లో జోష్ నింపింది.