అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్

అమరావతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె, కొవ్వు వాడారంటూ టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో తిరుపతి లడ్డు వివాదంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు.

 ఇవాళ (సెప్టెంబర్ 20) తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టుకథ అని.. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడటం ధర్మమేనా.. రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ప్రభుత్వ 100 రోజుల వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చడానికే తిరుమల నెయ్యి అంశాన్ని తెరపైకి  తెచ్చారని మండిపడ్డారు. తిరుమల లడ్డు తయారీకి ప్రతి 6 నెలలకు ఓసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని.. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదని.. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.   

ALSO READ | లడ్డూ నెయ్యిలో కల్తీ వాస్తవమే:టీటీడీ ఈవో శ్యామలారావు

చంద్రబాబు సర్కార్ 100 రోజుల పాలనపై నిప్పులు చెరిగారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసిందంతా మోసమేనని విమర్శించారు. చంద్రబాబుది 100 రోజుల పాలన కాదని.. 100 రోజుల మోసమని ఎద్దేవా చేశారు.  అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఎన్నికల్లో హామీ ఇచ్చినా సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెనూ లేదని అని.. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని నిప్పులు చెరిగారు.