వివేకాను చంపిందెవరో వారికి తెలుసు - ఎట్టకేలకు మౌనం వీడిన జగన్..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం కూడా మొదలు పెట్టిన నేపథ్యంలో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజు ప్రచారాన్ని ప్రారంభించటంతో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన జగన్ ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై జగన్ తొలిసారి స్పందించటం హాట్ టాపిక్ గా మారింది.

also read : వైసీపీకి షాక్: కాంగ్రెస్ లోకి డిప్యూటీ సీఎం మేనల్లుడు

వివేకా హత్య ప్రస్తావన తెచ్చిన జగన్, వివేకం చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. తనను ఒక్కడ్ని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకం అయ్యాయని అన్నారు. వీరంతా సరిపోదని బురద చల్లటానికి  తన చెల్లెళ్లను కూడా ఉసిగొల్పుతున్నారని అన్నారు. తన చెల్లెళ్లను ఎవరు పంపించారో, వారి వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. వారంతా రోజు కనిపిస్తూనే ఉన్నారని అన్నారు. వివేకాను దారుణంగా చంపిన వాడికి మద్దతు ఇస్తున్నారని, టీడీపీ మీడియా వాడిని నెత్తిన పెట్టుకుంటున్నారని అన్నాడు.