రోడ్డు విస్తరణ  పనులు పూర్తి చేయకుంటే దీక్ష చేస్తా : జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: పట్టణంలోని అంబేద్కర్  విగ్రహం నుంచి సిగ్నల్  గడ్డ వరకు ఉన్న రోడ్డు విస్తరణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయకుంటే దీక్ష చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి తెలిపారు. ఆదివారం జడ్చర్ల లోని ప్రేమ్​ రంగా గార్డెన్స్​లో జరిగిన కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్  మీనానాజ్, బీఆర్ఎస్  నేత షేక్ బాబాతో పాటు 300 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిగ్నల్​గడ్డ రోడ్డు నేషనల్  హైవే పరిధిలో ఉందని, రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరానని పేర్కొన్నారు. రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయకుంటే ఆందోళన చేసేందుకు వెనకాడేది లేదన్నారు. అధికారంలో లేని సమయంలో పార్టీని నమ్ముకొని పని చేసిన కార్యకర్తలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో ఇతర పార్టీల నుంచి ఎవరినీ చేర్చుకోనని తాను చెప్పానన్నారు. కానీ, ఇతర పార్టీల్లో ఉన్నవారు మంచి వారైతే వారిని పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్  సిద్ధంగా ఉంటుందని తెలిపారు.