డిసెంబర్ 19 న అసెంబ్లీ ముట్టడిస్తం : జేఏసీ

  • ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాల పిలుపు

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే సహించేది లేదని మాల సంఘాల జేఏసీ హెచ్చరించింది. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 19న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నామని వెల్లడించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌లో జేఏసీ నేతలు జి.చెన్నయ్య, మందాల భాస్కర్, చెరుకు రాంచందర్ మీడియాతో మాట్లాడారు.  సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ , ఎస్పీ వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షల మందితో ఈ నెల19న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నట్టు జి.చెన్నయ్య ప్రకటించారు. వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. 

సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని, అది తీర్పు కాదు.. సూచన మాత్రమేనని చెరుకు రాంచందర్ అన్నారు. మందాల భాస్కర్ మాట్లాడుతూ.. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మన్నె శ్రీధర్, వెంకటేశ్, జంగా శ్రీను, చేతన్ కుమార్, గుడిమల్ల వినోద్, కరణం కృష్ణ, నాను భాయ్, సుధీర్, రమేశ్‌,​దుబ్బాక నవీన్, బలవంత్, అంజలి పాల్గొన్నారు.