రూ.కోట్ల గోల్​మాల్​లో కేటీఆర్​..ఈ రేస్​లోనే కాదు..ఓఆర్​ఆర్​టోల్ లీజులోనూ హస్తం : రాచాల యుగంధర్ గౌడ్

  • కేబినెట్​తీర్మానం, ఆర్థిక శాఖ 
  • అప్రూవల్ లేకుండానే చేసిన్రు   
  • బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు : కేటీఆర్​కు ఫార్ములా ఈ రేస్ లోనే కాదని, ఓఆర్ఆర్ టోల్ లీజు వ్యవహారంలోనూ పాత్ర ఉందని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఐఆర్బీ ఇన్ ఫ్రాకు  ఓఆర్ఆర్ టోల్ లీజు కట్టబెట్టడం పెద్ద స్కాం అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వందల రూ. కోట్ల గోల్ మాల్ చేసిన బీఆర్ఎస్..ఎన్ క్యాష్ మెంట్ ద్వారా నిధులు మళ్లించుకుందన్నారు. క్విడ్ ప్రోకోతో ఎన్ క్యాష్ మెంట్ జరిగిందన్నారు. కోట్ల గోల్ మాల్ లో బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​హస్తం ఉందన్నారు. 

ఏప్రిల్​లో లీజుకిస్తే..జూలైలో బాండ్లు కొన్నరు

ఏప్రిల్ 27, 2023లో ఐఆర్డీ ఇన్ ఫ్రాకు ఓఆర్ఆర్ టోల్ రోడ్డును 30 ఏండ్లకు బీఆర్ఎస్ లీజుకు ఇచ్చిందని, దీనికి ప్రతిఫలంగా జూలై 4న ఐఆర్బీ బీఆర్ఎస్​కు సంబంధించిన రూ.25 కోట్ల ఎలక్టోరల్​బాండ్ కొన్నదని ఆరోపించారు. జులై 13న బీఆర్ఎస్ ఆ డబ్బులను ఎన్ క్యాష్ మెంట్ చేసుకుందన్నారు. జూన్ 16 న కూడా వరంగల్ కైటెక్స్ రూ.15 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కొన్నదని, సెప్టెంబర్ 12న రంగారెడ్డి జిల్లా కైటెక్స్ 2వ యూనిట్ టైంలోనూ రూ.10 కోట్ల బాండ్ కొందన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఈ క్విడ్ ప్రోకోపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకో అంశంపై సీఎం రేవంత్, సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామని, ఏసీబీ, ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్​రావుకు కూడా తెలియనివ్వకుండా, కేబినెట్​తీర్మానం, ఆర్థిక శాఖ అప్రూవల్ లేకుండా కేటీఆర్​ఇదంతా చేశారన్నారు.