గాంధీ, పేట్ల బుర్జుల్లో IVF ​సేవలు షురూ.. లక్షల విలువ చేసే వైద్యం పూర్తి ఉచితం

హైదరాబాద్ సిటీ, వెలుగు: అమ్మా.. అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ జీవిత కల. కొన్ని కారణాల వల్ల చాలా మందికి అది కలగానే మిగులుతున్నది. భార్యాభర్తల్లో లోపాలు, మారిన జీవన విధానాలతో కొంతమందికి సంతాన భాగ్యం కలగట్లేదు. రాష్ట్రంలో 26 శాతం మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. సమస్య తీవ్రతకు ఇది అద్దం పడుతున్నది. ఇలాంటి వారంతా ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఐయూఐ (ఇంట్రాయుటెరైన్​ఇన్సెమినేషన్), ఐవీఎఫ్​(ఇన్​విట్రో ఫెర్టిలైజేషన్ ) ట్రీట్​మెంట్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నరు. 

అప్పులు చేసి కొందరు, ఆస్తుల అమ్ముకొని మరికొందరు ఖర్చులు పెడుతున్నరు. అయినా, ఫలితం ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. సక్సెస్​రేటు అంతంత మాత్రమే కావడంతో అనుకున్నది నెరవేరక ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నరు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో ఫెర్టిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గాంధీ హాస్పిటల్‎తో పాటు పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్‎లో ఇప్పటికే ఐయూఐ సేవలు కొనసాగుతుండగా, ఐవీఎఫ్​సేవలు కూడా ప్రారంభించారు.

ఐయూఐ, ఐవీఎఫ్ అంటే..

సంతానలేమితో వచ్చేవారికి మొదట ఐయూఐ ద్వారా ట్రీట్​మెంట్ ఇస్తారు. ఈ విధానంలో భర్త నుంచి స్పెర్మ్ సేకరించి ల్యాబ్‎లో శుద్ధి చేస్తారు. తర్వాత హైలీ కాన్సట్రెడ్​స్పెర్మ్‎గా మార్చి భార్య గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతిలో సక్సెస్​రేటు ఎక్కువగా ఉంటుంది. అయినా సంతానం కలగకపోతే ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నిస్తారు. ఈ పద్ధతిలో ల్యాబ్‎లో అండం, స్పెర్మ్​ఫెర్టిలైజ్​చేస్తారు. 

తర్వాత పిండాన్ని భార్య గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇది ఖర్చుతో కూడుకున్నది. అలాగే సక్సెస్​రేటు కూడా తక్కువే. గాంధీ, పేట్ల బుర్జు ఐవీఎఫ్​సెంటర్లలో ఇప్పటి వరకు 60 మందికి ఐయూఐ సేవలందించారు. పలు స్క్రీనింగ్ టెస్టులు చేసి 9 మందిని ఐవీఎఫ్​కోసం గుర్తించారు. వీరిలో గాంధీలో ఐదుగురికి, పేట్ల బుర్జులో నలుగురికి ఐవీఎఫ్ చేస్తున్నారు.

త్వరలో జిల్లాల్లో కూడా..

హైదరాబాద్‎తో పాటు త్వరలో జిల్లాల్లో కూడా ఐవీఎఫ్​సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‎లో రెండు సెంటర్లు ఉండగా, మరో సెంటర్​ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల వెల్లడించారు. త్వరలో వరంగల్​ఎంజీఎంలో ఐవీఎఫ్​సెంటర్​ను ప్రారంభించనున్నారు. 

అలాగే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్​ఉమ్మడి జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాలను కలిపి 9 ఐవీఎఫ్​ సెంటర్లను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. దీనికి కావాల్సిన ఎంబ్రియాలజిస్టులకు కామినేని తదితర హాస్పిటళ్లలో ట్రైనింగ్​ఇస్తున్నారు. ఒక్కో ఐవీఎఫ్​సెంటర్ ఏర్పాటుకు రూ. 6 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. 

పేద, మధ్య తరగతి దంపతులకు అవకాశం.. 

ఐవీఎఫ్​చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్​హాస్పిటళ్లలో లక్షలు ఖర్చు చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఫ్రీగా అందిస్తోంది. ఇప్పటికే ఐయూఐ ఇస్తున్నాం. ఐయూఐతో పిల్లలు కానివారికి త్వరలోనే ఐవీఎఫ్ మొదలుపెడతాం. దీనికి సంబంధించిన ఎక్విప్​మెంట్​వచ్చింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రారంభించిన వెంటనే ఐవీఎఫ్​సేవలు మొదలుపెడతాం. పిల్లలు లేని పేద, మధ్య తరగతి దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 

- డాక్టర్​రజినీ రెడ్డి, సూపరింటెండెంట్,పేట్ల బుర్జు హాస్పిటల్