రక్షణ రంగంలో పురోగతి సాధిస్తున్నం: ద్రౌపది ముర్ము

  • సాంకేతికంగా మరింత డెవలప్ అవ్వాలి 
  •  స్వదేశీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నం
  • పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని రాష్ట్రపతి వెల్లడి
  • కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్​మెంట్​కు అవార్డు అందజేత 

సికింద్రాబాద్/హైదరాబాద్, వెలుగు: దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సాంకేతిక పరికరాలు తయారు చేస్తూ రక్షణ రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నదని తెలిపారు. సికింద్రాబాద్​లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్​మెంట్ (సీడీఎం)లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలేజ్​కు కలర్స్ ప్రజెంటేషన్ అవార్డు అందజేశారు.

అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడారు. ‘‘మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి పాలసీలతో రక్షణ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి దేశీయ పెట్టుబడులను ఆకర్శిస్తున్నది. దేశీయంగా రక్షణ పరికరాలు తయారు చేస్తున్నది. సంప్రదాయ బలగాలను అప్ గ్రేడ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, సైబర్ వార్​ఫేర్ సహా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థపై కేంద్రం ఫోకస్ పెడ్తున్నది. దేశ సరిహద్దులను కాపాడటంతోపాటు ప్రపంచ శాంతికి దోహదపడుతున్నది’’అని రాష్ట్రపతి అన్నారు. 

సీడీఎం కృషి అభినందనీయం

సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కార్యాచరణకు అనుగుణంగా అప్డేట్ కావాలని రాష్ట్రపతి సూచించారు. ఐదు దశాబ్దాల సీడీఎం ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆమె అభినందించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్, కోస్ట్ గార్డు అధికారుల శిక్షణలో ఉన్నత ప్రమాణాలకు సీడీఎం కృషి చేస్తున్నదన్నారు. ‘‘మన అధికారులు మిత్ర దేశాల ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తున్నరు. ఇది మన దేశ అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.

సాయుధ బలగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సీడీఎం కృషి చేస్తున్నది. రక్షణ రంగంలో మహిళా అధికారులను చూసి ఎంతో సంతోషంగా ఉన్నది. వాళ్లందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరంతా మహిళలు, యువతులకు ప్రేరణగా నిలుస్తారు’’అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, సీడీఎం కమాండెంట్ హార్స్ చిబ్బర్, త్రివిధ దళాల సైనిక అధికారులు పాల్గొన్నారు.