న్యూఢిల్లీ: కరోనా వైరస్ కష్టాల నుంచి ఇండియా పూర్తిగా బయట పడాలంటే కనీసం తొమ్మిది నెలల సమయం పడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. 2008లోని గ్లోబల్ సంక్షోభానికి ఈ కరోనా వైరస్ సంక్షోభం పూర్తిగా భిన్నమైనదని పేర్కొన్నారు. ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్ చాలా బలంగా ఉండాలని లేదంటే ఎకానమీ కుప్పకూలుతుందని వెబీనార్‌లో అన్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను(ఎన్‌బీఎఫ్‌సీలు) కూడా రెగ్యులేట్ చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో పరిస్థితి కాస్త అదుపులోనే ఉంది. ‘పేద ప్రజలను మరింత ఆదుకోవాలి. పేదరికం నుంచి వారిని బయట పడేయడానికి చర్యలు తీసుకోవాలి. ఏ సంక్షోభం ఎదురైనా మొదట ప్రభావితమయ్యేది వీరే. చివరిగా రికవరీ అయ్యేది కూడా వీరే. దేశానికి వీరే వెన్నుముకగా ఉంటున్నారు’ అని పరేఖ్ అన్నారు. సోమవారం రెండో స్టిములస్ ప్యాకేజీతో ప్రభుత్వం ముందుకొస్తుందని భావిస్తున్నానని, కాంప్లికేటెడ్ ట్యాక్స్ రూల్స్ ను తొలగిస్తారని ఆశిస్తున్నానని అంచనావేశారు. బ్యాంక్‌లు అప్పులు ఇవ్వడం బాగా తగ్గిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
స్టార్టప్‌లు తమకు కావాల్సిన మనీని సమకూర్చుకోవడానికి ఇది చాలా టఫ్ టైమని అన్నారు. మానుఫ్యాక్చరింగ్ మళ్లీ ప్రారంభించడం కూడా కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ ఉపాథి విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని బలవంతంగా తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. నిరుద్యోగులుగా మారిన లేబర్‌కు మేనేజ్‌మెంట్లు అవసరమైతే లైఫ్ సెక్యూరిటీ, ఫుడ్‌ను అందించాలన్నారు. ఇదే తమ తొలి ప్రాధాన్యంగా భావించాలని సూచించారు. మేనేజ్‌మెంట్లు ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు, భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. ఇంక్రిమెంట్లు, బోనస్‌లు లేవు. క్యాష్ ఫ్లో బ్యాక్ అనేది మేనేజ్‌మెంట్లు తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నాయి. వడ్డీరేట్లు తగ్గుతాయని తాను భావిస్తున్నానని, రేట్ల తగ్గుదలను బ్యాంక్‌లు కంపెనీలకు బదిలీ చేయాలన్నారు. ఆర్‌బీఐ ఇప్పటికే రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.4 శాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రెస్పాన్స్‌గా చాలా బ్యాంక్‌లు పలు లోన్ల లెండింగ్ రేట్లను తగ్గించాయి. బ్యాంక్‌లు ఈ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం ఉంది.
యెస్ బ్యాంక్ ఫెయిల్ అవ్వాలనుకోవడం లేదు..
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలు కరెక్ట్‌గా వర్క్‌వుట్ అవుతున్నట్టు ఆయన చెప్పారు. యెస్ బ్యాంక్ కూడా ప్రస్తుతం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలోనే ఉంది. యెస్ బ్యాంక్ తమ ప్రత్యర్థి అయినప్పటికీ, అది ఫెయిల్ అవ్వాలని కోరుకోవడం లేదన్నారు. ఇది కుప్పకూలితే, మరింత ప్రమాదమన్నారు. అయితే ప్రైవేట్ బ్యాంక్‌ల సమస్యలను, ప్రభుత్వ బ్యాంక్‌లు తమ నెత్తికెత్తుకోవడం కరెక్ట్ కాదని పరేఖ్ అభిప్రాయపడ్డారు. యెస్ బ్యాంక్‌పై ఫారిన్ బ్యాంక్స్, ఫండ్స్‌పై ఆసక్తి ఉంది. కానీ ప్రభుత్వం దీన్ని దేశ సమస్యగా తీసుకుని, ఇండియన్ బ్యాంక్‌లే పరిష్కరించాలని కోరుకుంటోందని తెలిపారు. పీఎంసీ బ్యాంక్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ విషయంలో తాము జోక్యం చేసుకోవాలనుకున్నామని, కానీ అనుకున్న మాదిరిగా జరుగలేదని పరేఖ్ వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి, కార్పొరేట్ బాండ్ పేపర్లను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లు ఇదే చేస్తున్నాయన్నారు. ఈక్విటీ మార్కెట్లు కూడా కరోనా దెబ్బకు బాగా ప్రభావితమయ్యాయని, ఇవి కూడా మళ్లీ పుంజుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్ పెనట్రేషన్ కూడా 12 శాతానికి పడిపోయింది. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్‌లో పార్టిసిపేషన్ పెరిగితే, మార్కెట్లలో భారీ ఎత్తున మార్పులు చూడొచ్చని పరేఖ్ అన్నారు. తొలిసారి ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారిని, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేలా చూడాలని, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులలో రిస్క్ కొంత తక్కువని పేర్కొన్నారు.
.
