కాఫీ డేపై ఐటీసీ చూపు

కాఫీ డేపై ఐటీసీ చూపు

ఐటీసీ వాటా తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌ లిమిటెడ్‌‌ షేరు వరసగా మూడో రోజూ ర్యాలీ జరిపి 16.1 శాతం పెరిగింది. 16 సెషన్స్‌‌లో నేలచూపులు చూసి 68.5 శాతం తగ్గిన ఈ షేర్‌‌ గత మూడు రోజులుగా పుంజుకుంది. బుధవారం 5 శాతం ( అప్పర్‌‌ సర్క్యూట్‌‌) పెరిగి బీఎస్‌‌ఈలో రూ. 72.8 కి చేరింది. కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌లో వాటా కొనుగోలు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఐటీసీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం డ్యూ డెలిజన్స్‌‌ ప్రక్రియ కూడా మొదలైనట్లు వెల్లడించాయి. ఇదిలావుంటే, ఐటీసీ వాటా కొనుగోలు వార్తలలో నిజం లేదని కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌ బీఎస్‌‌ఈ ఫైలింగ్‌‌లో తెలిపింది. అలాంటి పరిణామాలేవీ తమ దృష్టికి రాలేదని పేర్కొంది. గతంలో వాటా కొందామనుకున్న కోకకోలా చర్చలను మళ్లీ మొదలెట్టాలని కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌ ప్రమోటర్లు భావిస్తున్నట్లు మూడు రోజుల కిందట వార్తలు వచ్చాయి. అప్పులు తగ్గించుకునేందుకే ప్రమోటర్లు ఈ చొరవ తీసుకుంటున్నారనే  నేపథ్యంలోనే షేర్‌‌ ధర పెరగడం మొదలైంది. కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌కు దేశవ్యాప్తంగా 1,750 అవుట్‌‌లెట్లున్నాయి. ఈ నెట్‌‌వర్క్‌‌ కోకకోలాకు బాగా ఉపయోగపడుతుంది. గ్లోబల్‌‌ విలేజ్‌‌ టెక్‌‌ పార్క్‌‌ అమ్మకంతో రూ. 2,500 కోట్ల దాకా తగ్గనున్న అప్పులను మరింత తగ్గించుకోవడానికి కోకకోలా లేదా ఐటీసీ డీల్‌‌ సాయపడుతుందని భావిస్తున్నారు.